ముంబయిలో డిమాండ్

9 Mar, 2016 00:40 IST|Sakshi

 జిల్లాలోని సీతంపేట ఏజెన్సీలోని కొండ కోనల్లో పండుతున్న నల్లజీడి పంటకు ముంబయి మహానగరంలో డిమాండ్ ఏర్పడింది. అక్కడ రంగుల తయూరీ పరిశ్రమలో ఈ పిక్కలను విస్త­ృతంగా వాడుతుండడంతో ఇక్కడ జీసీసీ కొనుగోలు చేసి అక్కడకు ఎగుమతి చేస్తుంది. రంగుల తయూరీ పరిశ్రమల యజమానులు వీటిని వినియోగించుకుని మంచిగానే లాభపడుతున్నా...ఇక్కడ గిరిజన రైతులకు మాత్రం ఒరిగిందేమి లేదు. దీంతో గిట్టుబాటు ధర లేక..జీసీసీ తగిన ధర చెల్లించకపోవడంతో రైతులకు ఆర్థికంగా నష్టాలు తప్పడం లేదు.
 
 సీతంపేట :ఏజెన్సీలో కొండపోడులో పండే నల్లజీడి పిక్కలకు ముంబయిలో డిమాండ్ ఉంది. ఈ నల్లజీడిని రంగుల తయారీకి వినియోగిస్తున్నట్టు సమాచారం. గిరిజన సహకార సంస్థ వీటిని కిలో రూ.12కి కొనుగోలు చేస్తుంది.  అనంతరం క్వింటాళ్ల లెక్కన జీసీసీ వివిధ కంపెనీలకు విక్రయిస్తుంది. కిలోకు రూ.3 నుంచి ఐదు వరకు ఆదాయం వచ్చేటట్టు జీసీసీ అమ్మకాలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు  200 క్వింటాళ్ల వరకు నల్లజీడిని జీసీసీ సేకరించినట్టు తెలిసింది. సీతంపేటలో సోమవారం, బుధవారం మర్రిపాడు, గురువారం దోనుబాయి, శనివారం పొల్ల, కుశిమి వారపు సంతల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి జీసీసీ సేల్స్‌మెన్లు వీటిని కొనుగోలు చేస్తారు. మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులు మాత్రం వీటిని పెద్దగా కొనుగోలు చేయకపోవడం గమనార్హం.  ధరను పెంచితే తమకు గిట్టుబాటు ఉంటుందని గిరిజనులు పేర్కొంటున్నారు.
 
 రంగుల తయారీలో వినియోగం...
 ముంబయిలో రంగుల తయారీ కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తున్నట్టు తెలిసింది.  కేరళలో నల్లజీడి పిక్కల మధ్యలో ఉన్న పలుకులను తీసేసి ఇష్టంగా అక్కడ ప్రజలు తింటారు. నల్లజీడి నుంచి లోపల పిక్కలను వేరు చేసి కొన్ని సందర్భాల్లో అరకేజీ వరకు పలుకులను రూ.200లకు గిరిజనులు విక్రయిస్తారు. అయితే వీటి లోపల పలుకులను తీయడం చాలా కష్టమైన పని. దీనికి సంబంధించిన జీడి చేతికి అంటితే అంత వేగంగా వదలదు. పైగా దురదలు కూడా వచ్చేస్తాయని గిరిజనులు చెబుతున్నారు. అందుకే పలుకులను తీయలేని పరిస్థితిలో జీడి పిక్కలనే విక్రయించేస్తామని గిరిజనులు చెబుతున్నారు. ఏటా జనవరి నుంచి ఏప్రిల్ వరకు సీజన్ ఉంటుంది.   కొండల్లో  నల్లజీడిని గిరిజనులు సేకరిస్తారు. ఈ విషయమై జీసీసీ మేనేజర్ మాట్లాడుతూ ఎండీ నిర్ణయించిన ధరలకు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. నల్లజీడి కిలో రూ.12కు కొనుగోలు చేస్తున్నామన్నారు.
 

>
మరిన్ని వార్తలు