‘పశ్చిమ’లో నల్ల బంగారం నిక్షేపాలు

17 Jan, 2017 00:55 IST|Sakshi
‘పశ్చిమ’లో నల్ల బంగారం నిక్షేపాలు
  • చింతలపూడి ప్రాంతంలో అపారంగా ఉన్నట్లు గుర్తింపు
  • భూగర్భంలో తక్కువ లోతులోనే కనుగొన్న వైనం
  • చింతలపూడి: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి దేశవ్యాప్త ఖ్యాతి గడించబోతోంది. ఈ ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు వెల్లడి కావడం తో ఆంధ్రా సింగరేణిగా వార్తల్లోకి ఎక్కుతోంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బొగ్గు నిక్షేపాల అన్వేషణ కోసం జియా లాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) ఆధ్వర్యంలో సౌత్‌ వెస్ట్‌ పినాకిల్, మహేశ్వరి సంస్థలు పెద్దఎత్తున డ్రిల్లింగ్‌ పనులు చేపట్టాయి. చింతలపూడి, శెట్టివారిగూడెం ప్రాంతాల్లో 50–70 మీటర్ల లోతులోనే అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. మహేశ్వరి కంపెనీ నిర్వహించిన సర్వే(డ్రిల్లింగ్‌)లో నామవరం ప్రాంతంలోని రిగ్గు నంబర్‌–1 వద్ద 70 మీటర్ల దిగువన, రెండో రిగ్గు వద్ద 67 మీటర్ల దిగువన, 3వ రిగ్గు వద్ద 51 మీటర్ల దిగువన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేలింది. మిగిలిన ప్రాంతాల్లో 115 మీటర్ల లోతునుంచి 280 మీటర్ల లోతున నాణ్యమైన బొగ్గు నిల్వలున్నట్టు కనుగొన్నారు.

    6 నెలల్లో సర్వే పూర్తి
    సర్వే పూర్తి కావడానికి ఆర్నెల్లు పడుతుం దని జియాలజిస్ట్‌ ఎ.సతీష్‌ తెలిపారు. ప్రస్తుతం చింతలపూడి ప్రాంతంలో 120 పాయింట్లను గుర్తించి డ్రిల్లింగ్‌ చేస్తున్నా మన్నారు. ఈ ప్రాంతంలో సింగరేణి కన్నా నాణ్యమైన బొగ్గు ఉందన్నారు. సర్వే పూర్తయ్యాక కేంద్రానికి నివేదిక పంపాలని, నిక్షేపాల వెలికితీతకు అనుమతులు రావడానికి మాత్రం సమయం పడుతుందని చెప్పారు.

    2 వేల మిలియన్‌ టన్నుల నిల్వలు
     కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం  నుంచి మొదలుకొని పశ్చిమ గోదా వరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియన్‌ టన్నుల నల్ల బంగారం ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపు చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలోమీటర్ల పరిధిలో ఈ నిల్వలున్నట్లు సర్వే నివేదికలు వివరిస్తున్నాయి.

    మరిన్ని యంత్రాలు రప్పిస్తాం
    బొగ్గు అన్వేషణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరిన్ని అధునాతన యంత్రాలను రప్పించే పనిలో ఉన్నాం.
        – వీపీ యాదవ్, డీలర్, (జీఎస్‌ఐ)

మరిన్ని వార్తలు