గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ ముఠా పట్టివేత

23 Oct, 2013 02:46 IST|Sakshi

రాజమండ్రి, న్యూస్‌లైన్:గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ వ్యాపారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాజమండ్రిలోని లాలా చెరువు నుంచి క్వారీ మార్కెట్ వైపు వెళ్లే రోడ్డులో వేంకటేశ్వరస్వామి గుడి వద్ద ఓ స్థావరంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో త్రీటౌన్ సీఐ లక్ష్మీనారాయణ తన సిబ్బందితో దాడి చేశారు. అక్రమ వ్యాపారం చేస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. సిలిండర్లతో ఉన్న లారీ, మూడు కార్లు, రెండు మోటారు సైకిళ్లతో పాటు 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హిందుస్థాన్ పెట్రోలియం సంస్థకు చెందిన సిలిండర్లతో అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్టు గుర్తించారు.
 
 ప్రధాన నిందితుడైన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన గుడిమెట్ల వెంకటరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానిక లాలా చెరువు నుంచి క్వారీ మార్కెట్ రోడ్డులో తుప్పల మాటున ఉన్న ఖాళీ స్థలంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని అక్రమ వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తున్నారు. ఈ స్థావరంపై రాజమండ్రి ఆర్డీవో ఎం.వేణుగోపాలరెడ్డి, విజిలెన్స్ ఎస్పీ బి.నర సింహులు, సెంట్రల్ జోన్ డీఎస్పీ నామగిరి బాబ్జి, తహసిల్దార్ శ్రీనివాస్ తదితర అధికారులు దాడి చేసి, నిల్వ చేసిన సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో రాజమండ్రికి చెందిన కప్పల రాంబాబు, బెల్లాపు సత్యనారాయణ, శ్రీరెడ్డి సూర్యచంద్రరావు, గుడివాడ రమేష్‌కుమార్, వడ్డాది ఆదెమ్మ, షేక్ రబ్బానీ, గుబ్బల శ్రీనివాసరావు, నల్లా శ్రీను, ఇల్లా కోటేశ్వరరావు, కోడూరి గుబ్బయ్య ఉన్నారు.
 
 వారి వివరాల ప్రకారం.. గుడిమెట్ల వెంకటరెడ్డి అక్రమంగా గోడౌన్ నిర్వహిస్తూ, అవసరమైన వారికి అధిక ధరకు సిలిండర్లను విక్రయిస్తున్నాడు. కోరుకొండ రోడ్డులోని గుమ్మళ్లదొడ్డి గ్రామంలో గ్యాస్ కంపెనీ గోడౌన్‌లో లోడైన లారీని క్వారీ సెంటర్ నుంచి లాలా చెరువు రోడ్డులో తమ స్థావరానికి ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నారు. ఇక్కడ ఫుల్ సిలిండర్లు దించి, ఖాళీ సిలిండర్లను పెడుతున్నారు. సీట్లు తొలగించిన మూడు కార్లు, ఇతర వాహనాల ద్వారా తమ స్థావరంలో నిల్వ చేసి, రాజమండ్రిలో అవసరమైన వారికి బ్లాక్‌లో విక్రయిస్తున్నారు.
 
 రెస్టారెంట్లు, హోటళ్లకు తరలింపు
 రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు ఇతర వ్యాపారులకు అధిక ధరలకు ఈ సిలిండర్లను విక్రయిస్తున్నారు. దీనిపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో సోమవారం నుంచి ఈ స్థావరంపై నిఘా పెట్టారు. లారీలు రావడం, రీ లోడింగ్ చేస్తున్న సమయంలో అధికారులు దాడులు చేసి ముఠా గుట్టురట్టు చేశారు. ఈ బాగోతంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  దాడుల్లో పౌర సరఫరాల ఏఎస్‌వో సత్యనారాయణ రాజు, విజిలెన్స్ సీఐలు శ్రీనివాస్, ఫణిశ్రీ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
 
 గ్యాస్ ఏజెన్సీ కార్యకలాపాలు నిలిపివేత
 అత్తిలి : అత్తిలి హెచ్‌పీ గ్యాస్ ఏజన్సీని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిఎస్పీ ఎం.వీరారెడ్డి ఆధ్వర్యంలో  రికార్డులను తనిఖీ చేశారు. డిఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. అత్తిలి హెచ్‌పీ గ్యాస్ ఏజన్సీకి సోమవారం సాయంత్రం లారీపై 450 గ్యాస్ సిలిండర్లు దిగుమతి అయ్యాయి. అదే లారీపై 450 ఖాళీ బండలను లోడ్ చేసుకుని తిరిగి వెళుతుండగా రాజమండ్రి త్రీటౌన్‌లో సోమవారం రాత్రి పోలీసులు తనిఖీ చేయగా, అందులో 100 సిలిండర్లు గ్యాస్‌తో నిండి ఉన్నాయి. దీంతో అక్కడ పోలీసులు లారీని సీజ్ చేశారు.
 
 గ్యాస్‌తో ఉన్న వంద సిలిండర్లకు సంబంధించిన వివరాలు లభించలేదని, రికార్డులు నిర్వహణ సక్రమంగా లేదన్నారు.  నిత్యావసర వస్తువుల పంపిణీ  చట్టం ప్రకారం ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ ఎం.వీరారెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి గ్యాస్ ఏజెన్సీ కార్యకలాపాలను నిలిపివేసినట్లు చెప్పారు. తనిఖీల్లో అసిస్టెంట్ సివిల్ సప్లైస్ అధికారి ప్రసాద్, కొవ్వూరు సీఎస్‌డీటీ ఎంఎం అలీ, తణుకు డీటీ అశోక్‌వర్మ, విజిలెన్స్ తహసిల్దార్ శైలజ, అత్తిలి ఆర్‌ఐ మాలతి, వీఆర్వో ఎ.ప్రసాద్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు