నెల్లూరులో బ్లాక్‌మనీ కలకలం

16 Dec, 2016 01:37 IST|Sakshi

పోలీసుల అదుపులో హైదరాబాద్‌కు చెందిన నలుగురు రియల్టర్లు
నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు నగరంలో గురువారం బ్లాక్‌మనీ కలకలం రేగింది. నగరంలోని ఓ హోటల్‌లో రూ.కోట్లలో నోట్ల మార్పిడి జరుగుతోందని అందిన సమాచారంతో జిల్లా పోలీసులు ఓ హోటల్‌పై దాడిచేశారు. సుమారు గంటపాటు గదిలో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు. కానీ అక్కడ ఏమి దొరకకపోవడంతో గదిలో ఉన్న నలుగురు రియల్టర్ల(హైదరాబాద్‌)ను అదుపులోకి తీసుకొన్నారు. నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తికి హైదరాబాద్‌లో రూ.కోట్లు విలువ చేసే ఏడెకరాల భూమి ఉంది. దానిని హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు రియల్టర్లు 4 నెలల కిందట కొంత నగదు అప్పచెప్పి భూమి యజమాని వద్ద అగ్రిమెంట్‌ చేసుకొన్నారు.  జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ) చేసుకొనేందుకు వారు గురువారం నెల్లూరుకు వచ్చి దర్గామిట్టలోని మినర్వా హోటల్‌లో దిగారు. ఈ క్రమంలో హోటల్‌లో రూ.కోట్లలో  నగదు మార్పిడి జరుగుతోందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సాయంత్రం హోటల్‌పై దాడి చేశారు. దీంతో నలుగురు రియల్టర్‌లను అదుపులోకి తీసుకొన్నారు.

మరిన్ని వార్తలు