మీ బిడ్డగా ఆశీర్వదించండి

5 Apr, 2019 16:45 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనిల్‌ 

నెల్లూరు (టౌన్‌): మరో వారంలో జరగనున్న ఎన్నికల్లో మీ బిడ్డగా ఆశీర్వదించి తనను మరోసారి గెలిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ కోరారు. నగరంలోని పప్పులవీధిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అనిల్‌ మాట్లాడారు. మంత్రిగా ఉన్న 58 నెలల్లో నారాయణ ఎప్పుడైనా కనిపించారానని ప్రశ్నించారు. పాఠశాలలు, ఆస్పత్రిలో పేదలకు ఒక్క రూపాయైనా తగ్గించారానన్నారు.

పదేళ్ల రాజకీయ జీవితం గడిపానని, తన భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని చెప్పారు. అవినీతి మచ్చ లేకుండా నిజాయతీగా సేవ చేశానని తెలిపారు. రైల్వేలైన్‌ కోసం 700 ఇళ్లను తొలగిస్తామంటే కోర్టుకెళ్లి ప్రక్రియను నిలిపేయించిన విషయాన్ని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ప్రజలతోనే ఉంటున్నానని చెప్పారు. మంత్రి నారాయణ రూ.400 కోట్ల మేర దోచుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బులను కక్కించాలంటే సానుభూతికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటమి భయం మంత్రి నారాయణ కళ్లల్లోనే కనపడుతోందని, అందుకే దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు.

తప్పుడు ప్రచారం
ఏడాదిన్నర క్రితం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలను ఎన్నికల సమయంలో ఎడిట్‌ చేసి ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. నారాయణ విద్యాసంస్థల్లో 80 మందికి పైగా విద్యార్థులు చనిపోయారని, మంత్రి నారాయణ కనీసం ఒక్కరినైనా ఓదార్చారానని ప్రశ్నించారు. మెడికల్‌ కళాశాలలో 21 ఏళ్ల విద్యార్థిని మృతి చెందితే, ఆ సమయంలో అక్కడే ఉన్న నారాయణ కనీసం పరామర్శించలేదన్నారు. నారాయణ ఆస్పత్రిలో రూ.రెండు వేలు తగ్గినా శరీరం అప్పజెప్పని ఉదంతాలూ ఎన్నో ఉన్నాయని వివరించారు. డబ్బెప్పుడూ ముఖ్యం కాదని, వ్యక్తిత్వం గొప్పదన్నారు.

నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేశానని మంత్రి నారాయణ గొప్పలు చెప్పుకొంటున్నారని, హడ్కో నుంచి రూ.1100 కోట్ల రుణం పొంది ప్రజలపై అప్పుల భారాన్ని మోపిన విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. నారాయణకు ఓటేస్తే ప్రజలకు పంగనామాలు పెడతారని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాక తాను ఆస్తులను అమ్ముకున్నానని చెప్పారు. నగర నియోజకవర్గ పరిధిలో వందలాది మంది వ్యాపారులు ఉన్నారని, ఈ ఐదేళ్ల కాలంలో ఏ ఒక్కరినైనా ఇబ్బంది పెట్టానానని ప్రశ్నించారు. మీ బిడ్డలా ఆశీర్వదించాలని, ఏవైనా పొరపాట్లు ఉంటే తనను క్షమించాలని కోరారు. జిల్లాకు ఎవరొచ్చినా తనపైనే గురిపెడుతున్నారని, ఎన్నికల్లో తప్పకుండా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే గడప గడపకూ వచ్చి రుణం తీర్చుకుంటానని చెప్పారు.     

జగన్‌ సభ ఉందంటూ  విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు  

జగన్‌మోహన్‌రెడ్డి మీటింగ్‌ ఉందని స్టోన్‌హౌస్‌పేటలో ఉదయం ఏడు గంటల నుంచే విద్యుత్‌ సరఫరాను నిలిపేశారని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో చంద్రబాబు వంగివంగి దండాలు పెడుతున్నారని, అంత మాత్రాన ఓట్లు పడవన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఉదయించే సూర్యుడైతే.. చంద్రబాబు అస్తమించే సూర్యుడని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలు కర్తం ప్రతాప్‌రెడ్డి, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, సాయిరెడ్డి, జిలానీ, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు