ఆత్మవిశ్వాసమే ఆలంబనగా..

18 Jan, 2019 08:34 IST|Sakshi
కుటుంబ సభ్యులతో తిరుపతిరావు

దృష్టి లోపాన్ని జయించి ఆదర్శంగా నిలుస్తున్న కంబర యువకుడు

దేవుని సేవ.. ట్యూషన్‌ చెబుతూ ఉపాధి పొందుతున్న వైనం

శ్రీకాకుళం, వీరఘట్టం: కళ్లు, కాళ్లు సక్రమంగా ఉన్న వాళ్లే డిగ్రీలు పూర్తిచేసి లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఉపాధి వెతుక్కుంటూ వలసబాట పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కళ్లు సరిగ్గా కనిపించకపోయినా డిగ్రీ పూర్తి చేసి స్వయం ఉపాధితో తనకో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న వీరఘట్టం మండలం కంబర గ్రామానికి చెందిన పొగిరి తిరుపతిరావు విజయగాథ ఇది.. తిరుపతిరావుకు చిన్నప్పటి నుంచే దృష్టి లోపం ఉంది.

అయినా ఎప్పుడూ నిరాశ చెందలేదు. తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందినప్పటికీ బ్రాహ్మణుల వలే మంత్రాలు చదువుతూ బతుకు తెరువు కోసం అర్చకుడిగా మారాడు. గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయంలో బాబా సేవలో ఉంటూ భక్తుల గోత్రనామాలతో పూజలు చేస్తుండేవాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బాబాకు హారతులు ఇస్తూ వేదపండితుని మాదిరిగా మంత్రాలు చదువుతూ ఆదర్శంగా నిలిచాడు. భక్తులు ఇచ్చే దక్షిణలతో కొంత మొత్తంతో పూజా సామగ్రి కొని మిగిలిన దానితో కుటుంబ పోషణ చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాల ఆవరణలో 1 నుంచి 7వ తరగతి విద్యార్థులకు ట్యూషన్‌ కూడా చెబుతూ ముందుకు సాగుతున్నాడు.

పట్టుదలతో ఉన్నత చదువు పూర్తి..
వీరఘట్టం మండలం కంబర గ్రామానికి చెందిన పొగిరి తిరుపతిరావుకు పుట్టినప్పటి నుండే దృష్టి సమస్య ఉంది. రాత్రి పూట మాత్రం ఏమాత్రం కనిపించదు. అయినా ఎప్పుడు కుంగిపోలేదు. 1 నుంచి 7వ తరగతి వరకు కంబర పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు కంబరవలస హైస్కూల్‌లో, ఇంటర్‌ వీరఘట్టం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివాడు.  పార్వతీపురం వెంకటేశ్వర కళాశాలలో బీకాంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఉపాధి కోసం దూరప్రాంతం వెళ్లలేని పరిస్థితి కావడంతో గ్రామంలో ఉన్న సాయిబాబాను నమ్ముకున్నాడు. గ్రామస్తులు కూడా అండగా నిలిచారు. పక్కనే ఉన్న రామాలయం పూజారి వద్ద మంత్రాలు, పూజా విధానం నేర్చుకుని సాయిబాబా ఆలయంలో శాశ్వత అర్చుకుడిగా మారాడు.

దేవుని సేవలో..
దృష్టిలోపం ఉన్న ఈ కుర్రాడికి పెళ్లి ఎలా అవుతుంది.. పిల్లను ఎవరు ఇస్తారు అని అందరూ అనుకున్నారు. ఇంతలో దేవుడే తోవ చూపించాడు. నాలుగేళ్ల కిందట పాలకొండ మండలం తంపటాపల్లికి చెందిన అప్పలనరసమ్మ అనే ఓ యువతి తిరుపతిరావును వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చింది. పెద్దలు వీరికి వివాహం చేశారు. వీరికి ఇద్దరు సంతానం.  

బాబానే నమ్ముకున్నాను
చిన్నప్పటి నుంచి సాయిబాబానే నమ్ముకున్నాను. బీకాం డిగ్రీ పూర్తి చేసినా దూరం ప్రాంతంలో పనిచేయలేను. అందుకే బాబాసేవలో ఉంటూ స్థానికంగా ట్యూషన్‌ చెబుతూ స్వయం ఉపాధి పొందుతున్నాను. దేవుని సేవ చేసే అదృష్టం వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా భార్య చేదోడుగా ఉంటోంది.– పొగిరి తిరుపతిరావు, అర్చకుడు ,సాయిబాబా గుడి, కంబర, వీరఘట్టం మండలం    

మరిన్ని వార్తలు