రక్తనిధి.. సేకరణ ఏదీ?

30 Dec, 2013 02:11 IST|Sakshi

 వికారాబాద్, న్యూస్‌లైన్:  మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంతముఖ్యమో రక్తమూ అంతే. నిత్యం ఎంతోమంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి అభాగ్యుల ప్రాణ రక్షణకు రక్తం అత్యవసరమవుతుంది. కొన్నిసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించేటప్పుడు రక్తం అవసరమవుతుంది. సరైన రక్తం ఎక్కించి ఇలాంటి సందర్భాల్లో రోగికి ప్రాణదానం చేయవచ్చు. సరైన గ్రూపు రక్తం దొరక్క ఎందరో ప్రాణాలు విడిచి ఉంటారు. రక్తం అందక పశ్చిమ రంగారెడ్డి పరిధిలో రెండేళ్ల క్రితం వరకూ 642 మంది గర్భిణులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నట్లు సమాచారం. రక్తం కోసం హైదరాబాద్‌కు వెళ్లిన వారు తిరిగి వచ్చే సరికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ఈలోగా క్షతగాత్రులు, గర్భిణులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో రక్తం అవసరాన్ని గుర్తించి రెండేళ్ల క్రితం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
 
 ముఖ్య ఉద్దేశం ..
 దారిధ్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో గర్భిణులు ప్రసవ సమయంలో రక్తం లేకుండా చనిపోకూడదని భావించిన రాష్ర్ట ప్రభుత్వం రక్తనిధి కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. వీటి నిర్వహణ బాధ్యతను రెడ్‌క్రాస్ సొసైటీలకు అప్పగించింది.
 
 మొక్కుబడిగా...
 వికారాబాద్‌లో మొదట హంగూ ఆర్భాటాలతో ప్రారంభమైన ఈ రక్తనిధి కేంద్రం నేడు మొక్కుబడిగా కొనసాగుతోంది. ఒక డాక్టర్, ఐదుగురు స్టాఫ్ నర్సులు, ముగ్గురు టెక్నీషియన్లు, ఒక వాచ్‌మన్, ఒక హెల్పర్, స్వీపర్, ఒక సెక్యూరిటీ ఇక్కడ విధులు నిర్వర్తించాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు, ముగ్గురు టెక్నీషియన్లు మాత్రమే పనిచేస్తున్నారు.  
 
 ప్రస్తుత నిల్వ 20 యూనిట్లు మాత్రమే..
 ఐదు వేల యూనిట్ల వరకు రక్తాన్ని నిల్వ ఉంచే సామర్థ్యం వికారాబాద్ రక్తనిధి కేంద్రానికి ఉందని, అయితేప్రస్తుతం ఇక్కడ నిల్వ ఉన్నది 20 యూనిట్లు మాత్రమేనని డాక్టర్ పవన్‌కుమార్ వెల్లడించారు. రక్తనిధి కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ1000 యూనిట్ల రక్తాన్ని మాత్రమే రక్తదాన శిబిరాల ద్వారా సేకరించారు. ఇందులో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు 400 యూనిట్ల రక్తాన్ని, హైదరాబాద్‌లోని విద్యానగర్ కేంద్రానికి 350 యూనిట్ల రక్తాన్ని సరఫరా చేశారు.
 

మరిన్ని వార్తలు