రక్త కన్నీరు!

28 Apr, 2019 08:24 IST|Sakshi

జిల్లాలో తీవ్రమైన రక్త నిల్వల కొరత

ప్రభుత్వ.. ప్రైవేటు ఆస్పత్రుల్లో దొరకని వైనం

విద్యా సంస్థల సెలవుతో మరింత పెరిగిన డిమాండ్‌

రక్తనిధి కేంద్రాల్లో  నెగటివ్‌ గ్రూపుల ఊసేలేదు

కంటి చూపు మందగిస్తే అద్దాలు వాడొచ్చు. కాళ్లు, చేతులు పనిచేయకపోతే కృత్రిమ పరికరాలు పెట్టుకోవచ్చు. కానీ రక్తానికి ప్రత్యామ్నాయంగా ఏ ద్రవాన్ని వాడే పరిస్థితి లేదు. కేవలం ఒక వ్యక్తి చేసే రక్తదానమే మరొకరిని ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. అందుకే అన్ని దానాల్లోకన్నా రక్తదానం మిన్న అనే నానుడి ప్రాచుర్యం పొందుతోంది. కానీ జిల్లాలో ప్రస్తుతం రక్తనిల్వలు నిండుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 

చిత్తూరు అర్బన్‌: జిల్లాలో ఒక నెలకు 800 యూనిట్ల వరకు రక్తం అవసరమవుతోంది. కానీ ఇందులో సగం యూనిట్లు కూడా ప్రభు త్వ వైద్యశాలల్లో, ఇతర స్వచ్ఛంద సంస్థల్లో అందుబాటులో లేవు. కారణం.. వేసవి సెలవులు కావడం. నిజం.. వేసవి సెలవులు కావడంతో ఇంటర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఊర్ల కు వెళ్లిపోయారు. దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో జిల్లాలో రక్తనిధి కేంద్రాల్లో రక్తం నిండుకుంది. ఫలితంగా గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సకాలంలో రక్తం అందే పరిస్థితి కనిపించడం లేదు.

నెగటివ్‌ గ్రూపులకు ఇబ్బందే
చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యం వందకు పైగా యూనిట్ల రక్తం ఎప్పుడూ నిల్వ ఉంటుంది. కానీ ఇప్పుడు 40 యూనిట్లు మాత్రమే నిల్వ ఉంది. ఇందులోనూ స్క్రీనింగ్‌ చేసిన పాజిటివ్‌ గ్రూపులు 30 వరకు ఉంటే నెగటివ్‌ గ్రూపులన్నీ కలిపి ఎనిమిదే ఉన్నాయి. బీ–నెగటివ్‌ అయితే ఒక్కటే యూనిట్‌ ఉంది. ఈ రక్త గ్రూపు ఉన్న గర్భిణి ఎవరైనా కాన్పుకోసం ఆస్పత్రికి వచ్చి తప్పనిసరి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రాణాలపై వచ్చే పరిస్థితి నెలకొంది. శస్త్ర చికిత్స సమయంలో కనీసం మూడు యూనిట్ల రక్తం కావాలి. ఇక్కడంతలేదు. చిత్తూరు రక్తనిధిలోనే రక్తం లేకపోవడంతో జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుత్తూరు, పీలేరు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలకు చిత్తూరు నుంచి సరఫరా అయ్యే రక్తనిల్వలు ఆగిపోయాయి.

రక్తదానం ఎవరు చేయవచ్చంటే..

  •      వయసు 18–60 ఏళ్ల లోపు ఉండి సంపూర్ణ ఆరోగ్యవంతులైతే నిర్భయంగా రక్తదానం చేయవచ్చు.
  •      సన్నగా ఉన్నవారు రక్తదానం చేయకూడదని చాలామందిలో అపోహ ఉంది. ఇది తప్పు. 45 కిలోల కంటే ఎక్కువ బరువున్న వారు రక్తదానం చేయవచ్చు.
  •      రక్తదానం చేశాక కొన్ని రోజుల పాటు పనులన్నీ మానుకోవాలనే అపోహ వద్దు. రక్తం ఇచ్చాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని పళ్ల రసం, పాలు వంటి స్వల్ప ఆహారం తీసుకున్నాక మళ్లీ పనులు చేసుకోవచ్చు. 

డబ్బులిచ్చినా దొరకడం లేదు

జిల్లాలోని 15 ప్రాంతాల్లో రక్తనిధి     కేంద్రాలున్నాయి. 250మి.లీ రక్తాన్ని     ఓ యూనిట్‌గా పరిగణిస్తారు. ప్రభుత్వ వైద్యశాలలకు అనీమియా, రోడ్డు ప్రమాద బాధితులు వచ్చినప్పుడు కనీసం మూడు యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో రక్తనిధి కేంద్రాలు ఉండవు. వీళ్లు ఓ వ్యక్తి ద్వారా రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి దానం చేయించి, రూ.800 చెల్లించి ఒక్క యూనిట్‌ రక్తాన్ని వారి ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు తీసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం డబ్బులు చెల్లించినా కూడా జిల్లాలో ఎక్కడా రక్తం దొరకడంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు పక్క రాష్ట్రాల నుంచి కూడా రక్తం తెప్పించుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు