కష్టాల్లో ప్రాణదాత

24 Mar, 2016 01:49 IST|Sakshi
కష్టాల్లో ప్రాణదాత

రక్తనిధి కేంద్రాల్లో నిండుకున్న నిల్వలు
రక్తహీన బాధితులకు అందని వైనం
దాతల సహకారం కోసం ఎదురుచూపు

 
 
నరసరావుపేట టౌన్ : ప్రాణాపాయంలో ఉన్న వేలాది మందికి రక్తాన్ని అందించిన రక్తనిధిని కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రాణదాతకు  బ్లడ్‌ప్యాకెట్‌ల కొరత ఏర్పడింది. సేవల్లో రాష్ట్రంలోనే మొదటగా నిలిచిన నరసరావుపేట ఏరియా వైద్యశాల బ్లడ్‌బ్యాంక్‌లో మొట్టమొదటిసారిగా ఈ పరిస్థితి నెలకొంది. రక్తహీనతతో బాధపడే వారికి సరిపడా బ్లడ్ అందుబాటులో లేకపోవడంతో రక్తనిధి కేంద్రం నిర్వాహకులు తర్జనభర్జన పడుతున్నారు. దాతలు ముందుకు రాకుంటే బ్లడ్‌బ్యాంక్ నిర్వహణ కష్టతరంగా మారనుంది.

వివరాల్లోకి వెళితే నరసరావుపేట ఏరియా వైద్యశాలలో రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహణలో కొనసాగుతున్న బ్లడ్‌బ్యాంక్‌లో రక్త నిల్వలు అడుగంటాయి. ఈ బ్లడ్‌బ్యాంక్ ద్వారా జిల్లాలోని సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, బాపట్ల బ్లడ్ స్టోరేజ్ సెంటర్లకు రక్తపు నిల్వలు సరఫరా అవుతుంటాయి. ఒక్కొక్క సెంటర్‌కు నెలకు సుమారు 30 నుంచి 40 యూనిట్ల రక్తాన్ని పంపుతుంటారు. వీటితో పాటు ప్రతి రోజు ఏరియా వైద్యశాలలోని రోగులకు 10 నుంచి 20 యూనిట్ల బ్లడ్ అవసరముంది.

ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న తెల్లకార్డుదారులు ఈ బ్లడ్‌బ్యాంక్ సేవలనే పొందుతుంటారు. ఎప్పుడూ వంద నుంచి 150 యూనిట్ల బ్లడ్ ఇక్కడ అందుబాటులో ఉండేది.ప్రస్తుతం కేవలం ఒకరోజుకు సరిపడా  20 యూనిట్ల బ్లడ్ మాత్రమే అందుబాటులో ఉంటోంది. దీంతో అత్యవసరమైన వారికి మాత్రమే అందిస్తున్నారు. పేదలు అధిక ధరకు  ప్రైవేటు బ్లడ్‌బ్యాంక్‌లలో కొనుగోలు చేయాల్సి వస్తోంది. రెడ్‌క్రాస్ నిర్వహణలో కొనసాగుతున్న గుంటూరు బ్లడ్‌బ్యాంక్ ప్రస్తుతం మూతపడగా, రేపల్లెలో ఉన్న రక్తనిధి కేంద్రంలో బ్లడ్ కొరత ఉందని సమాచారం.

క్యాంపుల నిర్వహణ లేమితో...
బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పలు కళాశాలల్లో రక్తదాన క్యాంపులు నిర్వహించి విద్యార్థుల వద్ద రక్తాన్ని సేకరిస్తుంటారు. వాటిని బ్లడ్‌బ్యాంక్‌లో భద్రపరచి అవసరమైన వారికి అందిస్తుంటారు. విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో రెండు నెలల నుంచి క్యాంపుల నిర్వహణ సాధ్యంకాలేదు. దీంతో బ్లడ్ సేకరణ కష్టతరంగా మారి ఈ పరిస్థితి తలెత్తినట్లు వైద్యవర్గాలు చెపుతున్నాయి.
 
స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి
దాతలు, ఎన్‌జీవోలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ముందుకు వచ్చి సేవా తత్పరతతో రక్తదానం చేయాలి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సామాజిక స్పృహ కలవారు వెంటనే రక్తదానం చేయాలి.- డాక్టర్ బాబురెడ్డి,బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి

మరిన్ని వార్తలు