ఘోరం

21 Mar, 2014 05:28 IST|Sakshi
కారు బస్సు ఢీకొన్న దృశ్యం (ఇన్‌సెట్లో) కారులోని మృతదేహాలను పరిశీలిస్తున్న సీఐ, ఎస్‌ఐ

 ఓర్వకల్లు, న్యూస్‌లైన్: కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి నెత్తురోడుతోంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఐదు రోజుల క్రితం  నన్నూరు సమీపంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మృతి చెందిన విషయం మరువక ముందే మరో ప్రమాదం జరిగింది. హుసేనాపురం వద్ద గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.

హైదరాబాద్‌కు చెందిన పసుపుల వెంకట సుబ్బారావు (70), భార్య సాయి లక్ష్మి (65) కారులో ఈనెల 15వ తేదీన కడప చేరుకున్నారు. అక్కడ వెంకట సుబ్బారావు తండ్రి విశ్వేశ్వరరావు వైకుంఠ సమారాధనలో పాల్గొన్నారు. అక్కడి నుంచి బంధువులను కలిసేందుకు అనంతపురం వెళ్లారు. గురువారం ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

మార్గమధ్యంలో బనగానపల్లెలో ఉన్న బంధువులను చూసేందుకు వెళ్లారు. అక్కడ భోజనాలు చేసి సాయంత్రం బయలుదేరారు. వీరు హుసేనాపురం దాటిన తర్వాత కారు డ్రైవర్ తారక్ (16) ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించి బోయి ఎదురుగా హైదరాబాద్ నుంచి నంద్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. రెండు వాహనాలు వేగంగా ఉండటంతో కారు.. బస్సు కిందకు దూసుకెళ్లింది. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ తారక్, వెంకటసుబ్బారావు మృతదేహాలు చితికిపోయాయి.

 మృతుడు వెంకటసుబ్బారావు విజయవాడలో విద్యుత్‌శాఖ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తూ రెండేళ్ల క్రితం రిటైర్డ్ అయినట్లు తెలిసింది. సమాచారం అందిన వెంటనే ఓర్వకల్లు ఎస్‌ఐ విజయలక్ష్మి, కర్నూలు తాలుకా సీఐ శ్రీనివాసరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకుని మృతుల వద్ద లభించిన ఆధారాలతో విషయాన్ని బంధువులకు చేరవేశారు.

కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుప్రతికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనకడన కొనసాగుతుండటంతోనే నిత్యం ప్రమాదాలు చోటు  చేసుకుంటున్నాయి వాహనదారులు ఆరోపిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా