సర్కారు దొంగ దెబ్బ!

6 Feb, 2015 01:13 IST|Sakshi
సర్కారు దొంగ దెబ్బ!
  • పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంపు..ఇకపై ధరలెప్పుడు పెరిగినా భారీ వడ్డనే!
  • జనవరి 16న రూ. 2 పెంపుకు సవరణ పేరిట 5 శాతం వ్యాట్ పెంపు
  • పెట్రోల్ 31 శాతం నుంచి 35.2 శాతానికి,డీజిల్ 22.25 శాతం నుంచి 27 శాతానికి వ్యాట్
  • ఇప్పటికీ పక్క రాష్ట్రాలకన్నా లీటర్‌పై రూ. 2.60 అదనపు వసూలు
  • సాక్షి, హైదరాబాద్: పెట్రో బాదుడు విషయం లో తాత్కాలిక ప్రయోజనంకన్నా వ్యాట్ ద్వారా శాశ్వత ఆర్థిక ప్రయోజనాలకే రాష్ట్ర సర్కారు మొగ్గు చూపింది. తద్వారా వినియోగదారులను దొంగదెబ్బ తీసింది. అంతర్జాతీ యంగా ముడి చమురు ధరలు తగ్గినా, పెరి గినా తన రాబడికి భంగం కలగకుండా విలువ ఆధారంగా పన్ను పెరిగేలా నిర్ణయం తీసుకుంది. జనవరి 16న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినప్పుడు లీటర్‌కు రూ 2 చొప్పున నికరంగా అదనపు వ్యాట్ వసూలు చేసిన ప్రభుత్వం, సవరణ పేరుతో దీన్ని వ్యాట్ శాతాల్లోకి మార్చి శాశ్వతీకరించింది.

    పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రెండు రూపాయల చొప్పున వ్యాట్ పెంచడం వల్ల అది ఎంత శాతం పెరుగుదలో లెక్క కట్టి ఆ మేరకు సర్దుబాటు చేసినట్లు చూపుతూ...కొత్త కసరత్తు చేసింది. పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతం ఉన్న విలు వ ఆధారిత పన్ను (వ్యాట్)ను ఏకంగా ఐదు శాతం వరకు పెంచింది. దాంతో వ్యాట్ పెట్రోల్‌పై 31 శాతం నుంచి 35.2 శాతానికి, డీజిల్‌పై 22.25 శాతం నుంచి 27 శాతానికి పెరిగాయి. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయి. తద్వా రా ఇకపై ఎప్పుడు పెట్రో ధరలు పెరిగినా అది వ్యాట్ శాతంలోకి మారి తెలంగాణలో రిటైల్ ధరలు అమాంతం పెరుగుతాయి.

    అంతేకాదు, పెట్రోల్, డీజిల్‌పై ఇప్పటికే దేశంలోనే అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్న రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రికార్డును తెలంగాణ తిరగరాసి మొదటిస్థానానికి ఎగబాకింది. తాజా పెంపు వల్ల బుధవారం కేంద్రం పెట్రో ధరలు తగ్గిం చాక రాష్ట్రంలో రిటైల్ మార్కెట్‌లో పెద్దగా తేడా కనిపించకపోయినా, జనవరి 16న పెంచిన రూ.2 తేడా దాదాపు అలాగే కొనసాగుతోంది. ఎందుకంటే కిందటి తగ్గుదల వల్ల వినియోగదారులకు చేకూరాల్సిన సుమారు రూ.2 లబ్ధి వ్యాట్ పెంపు వల్ల దక్కకుండాపోయింది.

    దాంతో బుధవారంనాటి తగ్గింపు తర్వాత కూడా ఏపీ సహా పలు పొరుగు రాష్ట్రాలకన్నా తెలంగాణలో పెట్రోలు ధర లీటర్‌కు రూ.2.6 ఎక్కువగా ఉంది. జనవరి 16న లీటర్‌కు 2 రూపాయలు పెంచడం వల్ల ప్రజలకు  నెలకు రూ. 80 కోట్ల లబ్ధి రాలేని స్థితి ఉంది. ఇప్పుడు వ్యాట్‌శాతాన్ని పెంచడంవల్ల ఆ మొత్తంలో తేడా లేకపోగా, ఒకవేళ ఏ మాత్రం ధర పెరిగినా వ్యాట్‌ప్రకారమే భారం పడనుంది.
     
    వ్యాట్ పెంపు వల్ల ధరలు పెరగలేదు

    ఇటీవల పెంచిన వ్యాట్‌ను సవరిస్తూ విలువపై పన్ను వేశాం. దీనివల్ల ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ లీటర్ ధరలో తేడా ఉండదు. చమురు సంస్థలు ధర తగ్గించినప్పుడల్లా ఇక్కడ కూడా ధరలు తగ్గుతాయి.
     - వాణిజ్యపన్నుల శాఖ , అదనపు కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి
     
    కేంద్రం ధరలు పెంచితే వినియోగదారుడిపై భారం

    తెలంగాణ సర్కార్ చాలా తెలివిగా వ్యవహరించింది. వ్యాట్ మీద లీట ర్‌పై పెరిగిన రెండు రూపాయల పన్నును సవరిస్తున్నట్టు చెప్పినా, భవిష్యత్తులో ఇది ఆందోళనకరమే. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగి తే ఆ విలువ ఆధారంగా ఐదు శాతం వరకు పన్ను పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వానికి లభించింది. ఈ నిర్ణయం వల్ల 10 నుంచి 15 పైసలు రేపటి నుంచి రిటైల్‌లో తగ్గినట్టు కనిపించినా, జనవరి 16 నాడే పెరిగిన రెండు రూపాయల వల్ల ఇప్పటికీ పక్క రాష్ట్రాలకన్నా రాష్ట్రంలో రూ. 2.60 ఎక్కువగా ఉంది.    
    -వినయ్, తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి

మరిన్ని వార్తలు