విధులపై నిర్లక్ష్యం..వసూళ్లే లక్ష్యం

7 Mar, 2019 13:13 IST|Sakshi

చిరు వ్యాపారులపై దందా పెట్రేగిపోతున్న బ్లూ కోట్స్‌

తిరుచానూరులో మామూళ్ల దందా

ఇసుక ట్రాక్టర్లు కనిపిస్తే పండగే!

ట్రాక్టర్ల యజమానుల నుంచి గుంజుడు

మద్యం దుకాణాల వద్ద ఆగని         వసూళ్ల పర్వం

లోపించిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

తిరుపతి క్రైం: నిత్యం వివిధ సమస్యలతో పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించే బాధితులతో స్నేహపూర్వకంగా మెలగాలనే ఉద్దేశంతో అర్బన్‌ ఎస్పీ ‘ఫ్రెండ్లీ పోలీసు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొంతకాలం ఇది సజావుగానే సాగింది. ఆ తర్వాత క్రమేణా గాడి తప్పిందనే విమర్శలు వస్తున్నాయి. విధులను సక్రమంగా నిర్వర్తించాల్సిన పోలీసులు వసూ ళ్ల బాట పట్టారు. చిరు వ్యాపారుల నుంచి ఇసుక మాఫియా వరకు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. అలాగే మద్యం షాపులను రాత్రిపూట మూసే సమయానికల్లా అక్కడికి చేరుకుని బ్లూకోట్స్‌ రూ.100, రక్షక్‌ వాహనాలు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

కలెక్షన్‌కే ప్రాధాన్యత
రక్షక్‌ వాహనాలు ప్రజల రక్షణను గాలికొదిలేస్తున్నాయనే విమర్శలొస్తున్నాయి. రక్షణ కన్నా కలెక్షన్‌పైనే ఎక్కువగా దృష్టి సారించారని నగర ప్రజలు మండిపడుతున్నారు. ఎక్కడ చిరు వ్యాపారులు కనిపించినా వారిని వదలడం లేదు. తమ దుకాణాలకొచ్చి తినుబండారాలను తినడంతో పాటు డబ్బులు డిమాండ్‌ చేస్తూ, తమ కడుపు కొడుతున్నారని చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని ప్రశ్నిస్తే రోడ్డుకు అడ్డంగా వ్యాపారాలు చేస్తారా? అని తమపై కేసులు బనాయిస్తున్నారని వారు లబోదిబోమంటున్నారు. గతంలో రౌడీలు మామూళ్లు వసూలు చేస్తుంటే, ప్రస్తుతం పోలీసులే దర్జాగా వసూళ్లకు తెగబడుతున్నారని వాపోతున్నారు.

విధులు పక్కన పెట్టి సరదాలు
రక్షక్‌ వాహనంలో సంచరిస్తూ ఎక్కడ ఎలాం టి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత రక్షక్‌ పోలీసులది. అయితే వా హనాన్ని చెట్ల కింద పార్కింగ్‌ చేసి సరదాలు చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

తిరుచానూరులో పెట్రేగిపోతున్న ఆగడాలు
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుచానూరులో పోలీసులు ఆగడాలకు అంతులేకుండా పోతోంది. స్టేషన్‌లో బ్లూకోట్స్‌లో విధులు నిర్వహిస్తున్న, సుమారు 45 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తిరుచానూరు నుంచి అక్రమంగా ఇసుక రవాణా వాహనాలే వారికి టార్గెట్‌. తెల్లవారుజామున  బైక్‌పై వెళ్లి ఇసుక వాహనాలను అడ్డగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా నేరమని, వాహనాన్ని స్టేషన్‌కు తరలించాలంటూ డ్రైవర్‌ను హడలెత్తిస్తారు. ఆ తర్వాత వాహన యజమానిని అక్కడికి రప్పించి, సెటిల్‌మెంట్‌ చేసుకుంటున్నారని తిరుచానూరు ప్రజానీకం కోడై కూస్తోంది. జాతీయ రహదారిపై గస్తీ పేరిట ప్రతి వాహనం నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు పర్యవేక్షణ లోపించడంతో  ఇలా బ్లూకోట్స్‌ పోలీసుల ఆగడాలకు అంతులేకుండాపోతోందని ప్రజలు మండిపడుతున్నారు. గతంలో కూడా తిరుచానూరు పోలీసులపై పలు ఆరోపణలొచ్చినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది.

ఏదీ నిఘా?
గతంలో రక్షక్, బ్లూకోట్స్‌ పోలీసులపై ప్రత్యేక నిఘా ఉండేది. దీంతో వారు సక్రమంగా విధులను నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం వారిపై నిఘా కొరవడంతో అందిన కాడికి దోచుకుంటున్నారు. రాత్రి వేళ్లల్లో మద్యం దుకాణాలపై దాడులు చేయడం, మామూళ్లు దండుకోవడం పరిపాటిగా మారింది. ఎవరైనా గళం విప్పితే ఇక ఆ మద్యం దుకాణం సంగతి సరేసరి! చేసేదేమీ లేక వారు కూడా విధిలేక మామూళ్లను ముట్టజెపుతున్నారు.

ఇటు చూడండి అర్బన్‌ ఎస్పీ సారూ!
అంతేకాకుండా మామూళ్ల వసూళ్లను ఆయా స్టేషన్‌ పరిధిలోని ఉన్నాధికారులకు సైతం వాటా లు అందుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై ఇకనైనా అర్బన్‌ ఎస్పీ ప్రత్యేక నిఘా ఉంచి, దారిన పెట్టాలని, ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థకు సార్థకత చేకూరేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు