దశల వారీగా లాక్‌డౌన్‌ ముగింపుపై బ్లూప్రింట్‌

13 May, 2020 04:44 IST|Sakshi

రంగాల వారీగా బ్లూప్రింట్‌ల రూపకల్పనకు ఆరు కమిటీలు 

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ అన్ని రంగాలూ విధిగా పాటించాలని స్పష్టీకరణ

రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని చేసిన సూచనలకు అనుగుణంగా కార్యాచరణ

నేడు సీఎస్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌కు బ్లూప్రింట్‌ నివేదికలు

సాక్షి, అమరావతి: దశలవారీగా లాక్‌డౌన్‌కు ముగింపు పలికేందుకు బ్లూప్రింట్‌ను రూపొందించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలకు సూచన చేసిన నేపథ్యంలో.. బ్లూప్రింట్‌ల రూపకల్పనకు రంగాల వారీగా ఆరు కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా కమిటీలు ఆయా రంగాల్లో క్రమంగా దశలవారీ లాక్‌డౌన్‌ ముగింపు తరువాత కార్యకలాపాలు కొసాగించేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే నిబంధనలు పాటించాలి? అమలు చేయాలనే అంశాలతో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌తో బ్లూప్రింట్‌లను నివేదికల రూపంలో రూపొందించి బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌కు సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆయా రంగాలన్నింటికీ ఈనెల 17వ తేదీలోగా ముసాయిదా నివేదికలను పంపించాలని పేర్కొన్నారు. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ అన్ని రంగాలు విధిగా పాటించాలన్నారు. వీటి అమలు తీరు తెన్నులపై పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. 

ఆరు కమిటీలు, ఆరు బ్లూ ప్రింట్‌లు..
1. షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌: 
ఎ. పట్టణ ప్రాంతాల్లో కార్యకలాపాలపై రెవెన్యూ (వాణిజ్య పన్నులు) ప్రత్యేక సీఎస్‌ నేతృత్వంలో కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సభ్యులుగా కమిటీ.
బి. గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలపై రెవెన్యూ (వాణిజ్య పన్నులు) ప్రత్యేక సీఎస్‌ నేతృత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి సభ్యులుగా కమిటీ. ఈ కమిటీ వీధి వ్యాపారులు, అనధికారిక దుకాణాలపై కూడా పరిశీలించాలి.
2. పరిశ్రమల కార్యకలాపాలపై పరిశ్రమల శాఖ ప్రత్యేక సీఎస్‌ నేతృత్వంలో కార్మిక శాఖ కమిషనర్, పరిశ్రమల డైరెక్టర్, ఫ్యాక్టరీల డైరెక్టర్‌ సభ్యులుగా కమిటీ.
3. ప్రాథమిక రంగమైన వ్యవసాయ అనుంబంధ కార్యకలాపాలు, గ్రామీణాభివృద్ధి కార్యకాలపాలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్‌ నేతృత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి, పశుసంవర్థక శాఖ డైరెక్టర్, మత్స్యశాఖ కమిషనర్, మార్కెటింగ్‌ కమిషనర్, వ్యవసాయ కమిషనర్, ఉద్యాన కమిషనర్, మార్క్‌ఫెడ్‌ ఎండీ సభ్యులుగా కమిటీ.
4.    ప్రజా రవాణా కార్యకలాపాలపై రవాణా– రహదారులు– భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎండీ, రవాణా శాఖ కమిషనర్‌ సభ్యులుగా కమిటీ.
5.    పబ్లిక్‌ కార్యకాలపాలపై జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌ నేతృత్వంలో రవాణా– రహదారులు– భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సభ్యులుగా కమిటీ.
6. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ సర్వీసుల కార్యకలాపాలపై సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్‌) కార్యదర్శి, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ సభ్యులుగా కమిటీ. 

మరిన్ని వార్తలు