ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్‌కు రంగం సిద్ధం?

15 Sep, 2013 02:46 IST|Sakshi
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు జరగాలన్న ఆదేశాలను తుంగలో తొక్కి, అధిక ధరకు అమ్మేవారిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలతో శ్రీకాకుళం ఎక్సయిజ్ సీఐ ఎస్.విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సస్పెన్షన్ నుంచి తప్పించుకునేందుకు ఆయన హైదరాబాద్‌లో పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. శ్రీకాకుళం ఎక్సైజ్ సీఐ విజయ్‌కుమార్ తొలినుంచి ఆరోపణలను ఎదుర్కొంటూనే ఉన్నారు. గతంలో అధిక ధరకు మద్యం అమ్మకాలను నియంత్రించాలన్న కోర్టు సూచనలతో అన్ని జిల్లాలకు ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. వాటిని శ్రీకాకుళం సీఐ తుంగలో తొక్కుతూ మద్యం వ్యాపారులకు అండగా నిలిచారన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. 
 
 అధిక ధరకు మద్యం అమ్మకాల నియంత్రణకు హైదరాబాద్ నుంచి స్పెషల్ టాస్క్‌ఫోర్సు సిబ్బంది అన్నిజిల్లాల్లో దాడులు చేపట్టారు. ఏడాది క్రితం శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలి వద్ద ఉన్న ఎస్‌వీఆర్ వైన్స్ దుకాణానికి సాధారణ వ్యక్తుల్లా వెళ్లి మద్యం కొనుగోలు చేశారు. అధిక ధరకు విక్రయించడంతో వెంటనే ఆ దుకాణాన్ని సీజ్ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సీఐ విజయ్‌కుమార్‌కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. సీఐ వివరణ సరిగ్గా లేకపోవటంపై అప్పట్లోనే టాస్క్‌ఫోర్స్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కేసు ఫైలును ఇంకా మూసేయలేదని సమాచారం. సుమారు ఎనిమిది నెలల కిందట టాస్క్‌ఫోర్స్ సిబ్బంది బలగ, వరం కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని మూడు బెల్టు దుకాణాల నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ వాటి నిర్వాహకులు ‘మీరు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కారని’ దబాయిస్తూ తిరిగి మద్యం సీసాలను తీసుకెళ్లిపోయారు.
 
 అక్కడ వివాదం జరుగుతున్నా ఎక్సైజ్ సీఐ కన్నెత్తి చూడకపోవటాన్ని కూడా టాస్క్‌ఫోర్స్ అధికారులు తీవ్రంగా పరిగణించి, కేసును బలంగానే నమోదు చేసినట్టు సమాచారం. కొంత కాలంగా శ్రీకాకుళంలో ఫుల్‌బాటిల్‌పై రూ.20 నుంచి రూ.40 వరకు ఆయా బ్రాండ్లను బట్టీ అధిక ధరకు విక్రయిస్తున్నారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ అధికారులు నిఘా పెట్టినట్టు తెలుస్తొంది. సీఐ విజయ్‌కుమార్ మామూళ్లు తీసుకుంటూ అధిక ధరకు విక్రయిస్తున్నా పట్టించుకోనట్టు టాస్క్‌ఫోర్స్ నిఘాలో వెల్లడైనట్టు సమాచారం. వీటన్నింటి నేపధ్యంలో సీఐ సస్పెన్షన్‌కు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. తనకు బాగా తెలిసిన వారి సాయంతో ఎక్సైజ్ జాయింట్ కమిషనర్‌ను కలిసి సస్పెన్షన్ నిలిపివేతకు హైదరాబాద్‌లో ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ శాఖ సిబ్బంది చెప్పుకొంటున్నారు.
 
>
మరిన్ని వార్తలు