కట్టబెట్టేదిఎవరికో...

3 Jan, 2014 02:24 IST|Sakshi
కట్టబెట్టేదిఎవరికో...

=రూ .72 లక్షల విలువైన పనుల టెండర్లు రద్దు
 =చక్రం తిప్పిన ఐటీడీఏ ఇంజినీర్లు
 =కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించేలా ఎత్తుగడ
 =డిపార్ట్‌మెంట్ పేరిట అనుంగు కాంట్రాక్టర్‌కు అప్పగించే యత్నం

 
మేడారం మహా జాతర సమయం దగ్గర పడుతున్న కొద్దీ... అధికారులు తమ తమ ఆలోచనలకు పదునుపెట్టారు. వనదేవతల సందర్శనార్థం వచ్చే కోట్లాది మంది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకని అనుకుంటే మాత్రం పొరపాటే. తమ దగ్గరివారికి పనులు కట్టబెట్టి.. జేబులు నింపుకునేందుకు వారు కొత్త ఎత్తులు వేశారు. ఇన్‌ఫిల్టరేషన్ పనుల్లో ఏకంగా కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి... టెండర్ల పద్ధతికి స్వస్తి పలికించి... దోపిడీకి దారి సుగమం చేసుకున్నారు.  
 
సాక్షి, హన్మకొండ: గిరిజన సంక్షేమ శాఖలో రెగ్యులర్ ఎస్‌ఈ లేకపోవడంతో... ఐటీడీఏ ఇంజినీర్ల హవా నడుస్తోంది. పలువురు అధికారులు చక్రం తిప్పి.. డిపార్ట్‌మెంట్ పేరిట తమ అనుంగు కాంట్రాక్టర్‌కు ఇన్‌ఫిల్టరేషన్ పనులు అప్పగించేందుకు తెగబడ్డారు. వాటాల కోసం సర్కారు ఖజానాకు ఎసరు తెచ్చారు. టెండర్ల దాఖలు చివరి రోజున రద్దు చేసినట్లు ప్రకటించి తమ చాణక్యతను చాటుకున్నారు.

మహా జాతర సందర్భంగా రెడ్డిగూడెం, చిలుకలగుట్ట వద్ద ఇన్‌ఫిల్టరేషన్ వెల్, పైపులైన్ నిర్మాణాలకు సంబంధించి ఒక్కో పనికి  రూ.36 లక్షల వంతున గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన టెండర్లను ఆన్‌లైన్‌లో ఆహ్వానించారు.  ఈ పనులకు టెండర్లు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 2014 జనవరి 2 అని కూడా ప్రకటించారు. ఈ మేరకు పనులు దక్కించుకునేందుకు చాలా మంది కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. కానీ... దాఖలు చివరి రోజు గురువారం చివరి నిమిషంలో ఈ టెండర్లు రద్దయినట్లు ఆన్‌లైన్‌లో ఉత్తర్వులు రావడంతో కాంట్రాక్టర్లు షాక్ తిన్నారు. వాస్తవానికి ఈ టెండర్లు  రద్దు చేస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్ 27వ తేదీనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ అధికారులు వెంటనే ధ్రువీకరించకుండా... టెండర్ దాఖలుకు చివరి రోజున వెల్లడించడాన్ని బట్టి వారి పన్నాగం ఏంటో ఇట్టే గ్రహించవచ్చు.
 
తెరవెనుక ఒప్పందం
 
తమకు అనుకూలంగా ఉండే ఓ కాంట్రాక్టర్‌తో ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ముందస్తుగా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సదరు కాంట్రాక్టర్‌తో పని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పైపులను సైతం అధికారులే దగ్గరుండి తెప్పించారు. అంతా తమ కనుసన్నల్లోనే జరుగుతోందని వారు అనుకుంటుండగా... హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ చీఫ్ ఇంజినీర్ పర్యవేక్షణలో గత ఏడాది డిసెంబర్ 26న ఈ పనులకు ఆన్‌లైన్ టెండర్లను ఆహ్వానించారు. దీంతో ఏటూరునాగారం ఐటీడీఏ ఇంజినీరింగ్  అధికారులకు దిక్కుతోచకుండా పోయింది. వెంటనే రంగంలోకి దిగి చ క్రం తిప్పారు.

ఇప్పటికే ఐటీడీఏ నుంచి ఆలస్యంగా నిధులు విడుదలయ్యాయి.... ఇప్పుడు టెండర్లు అంటే మరింత ఆలస్యమవుతుంది.... దాని వల్ల జాతరకు ముందుగా పనులు పూర్తి కావనే ఉద్దేశంతో ఐటీడీఏ ఇంజినీరింగ్ శాఖ తరఫున పనులు ప్రారంభించామంటూ కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారు. ఈ నేపథ్యంలో టెండర్లు పిలిచిన మరుసటి రోజే  కలెక్టర్ కిషన్ వాటిని రద్దు చేశారు. అయితే ఈ విషయాన్ని వెంటనే తెలిపితే తమ బండారం బట్టబయలవుతుందని గ్రహించిన అధికారులు మరో ఎత్తుగడ వేశారు. టెండర్ దాఖలు చేసేందుకు చివరి రోజున వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.  
 

మరిన్ని వార్తలు