గురుకుల పాఠశాలలుగా వసతి గృహాలు

30 Jul, 2014 01:31 IST|Sakshi
గురుకుల పాఠశాలలుగా వసతి గృహాలు

 సాక్షి, కాకినాడ :రాష్ర్టంలోని వివిధ సంక్షేమ వసతి గృహాలను దశల వారీగా గురుకుల పాఠశాలలుగా అభివృద్ధి చేయనున్నట్టు రాష్ర్ట మంత్రులు వెల్లడించారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రమైన కాకినాడలో రాష్ర్ట ఉపముఖ్యమంత్రి, హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు ఆర్థిక, మానవ వనరులు, మున్సిపల్ శాఖల మంత్రులు యనమల రామకృష్ణుడు,  గంటా శ్రీనివాసరావు, పి.నారాయణలు సందడి చేశారు. రూ.6.30 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రారంభించారు.
 
 తొలుత ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌ను ఆనుకొని జీఎస్‌పీసీ సీఎస్‌ఆర్ కింద సమకూర్చిన రూ.35 లక్షలతో నిర్మించిన సూటురూమ్స్, అదనపు సమావేశపు హాలుతో కూడిన ఆర్ అండ్ బీ అదనపు భవన సముదాయాన్ని, మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లాను ఆనుకొని రూ.కోటితో నిర్మించిన ఈవీఎంలు భద్రపర్చే గోదామును రాష్ర్ట మంత్రులు చినరాజప్ప, యనమల ప్రారంభించారు. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా కార్పొరేషన్ సీఆర్‌ఎస్ కింద రూ.1.24 కోట్లతో జిల్లావ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఆధునికీకరించడంతో పాటు విద్యార్థులకు దోమతెరలు, టూటైర్ కాట్స్, డెస్క్‌టాప్ కంప్యూటర్స్ వంటి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చారు.
 
 ఆధునికీకరించిన జగన్నాధపురం సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ భవన సముదాయాన్ని రాష్ర్టమంత్రులు గంటా,యనమల, చినరాజప్పలు ప్రారంభించడంతో పాటు విద్యార్థులకు దోమ తెరలు, దుప్పట్లు, దుస్తులు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. ఏఎంజీ స్కూల్‌లో జిల్లా స్థాయి వైద్య, విజ్ఞాన ప్రదర్శనను మంత్రులు ప్రారంభించారు. అనంతరం జేఎన్‌టీయూకేలో రూ.1.67 కోట్లతో నాగావళి-2 పేరిట నిర్మించిన లేడీస్ హాస్టల్ భవన సముదాయంతో పాటు రూ.3.04 కోట్లతో నిర్మించిన బి-2 స్టాఫ్ క్వార్టర్స్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలికల సంక్షేమ హాస్టల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బడి పిలుస్తోంది సభకు, ఏఎంజీ సైన్స్‌ఫేర్ ప్రారంభ సభలకు స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) అధ్యక్షత వహించారు.
 
 సీఎస్‌ఆర్ నిధుల ఖర్చుకు ప్రణాళికలు
 సభలో ఆర్థికమంత్రి యనమల మాట్లాడుతూ ఇక నుంచి ఓఎన్జీసీ, రిలయన్స్, జీఎస్పీసీ తదితర బడా సంస్థలు తాము ఆర్జించే ఆదాయంలో కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్) కింద ఖర్చు చేయాల్సిన రెండు శాతం నిధులను ఒకే హెడ్‌లో సేకరించి వాటిని ప్రభుత్వ పరంగా అవసరమైన ప్రాంతాల్లో ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో ప్రైవేటురంగానికి దీటుగా ప్రభుత్వ విద్యారంగం ఉంటుందని, ఇక్కడ కూడా అదే రీతిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగస్తుల నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపే విధంగా వాటిని తయారు చేస్తామన్నారు. మరో రాష్ర్ట మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
 
 పతిష్టాత్మక పదకొండు విద్యాసంస్థలు వస్తున్నాయని, వాటి ద్వారా రాష్ర్టం రూపురేఖలు మారిపోనున్నాయని గంటా చెప్పారు. రాష్ర్ట ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ విద్యా రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ఈ రంగానికి నిధుల కొరత రానీయకుండా చూస్తామన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో సంక్షేమ హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం ద్వారా ప్రతి ఒక్కరూ ఉచిత  నిర్బంధ విద్యను పొందే అవకాశం లభించిందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పేరెంట్స్ మీట్స్‌ను ఏర్పాటు చేసి జవాబుదారీ తనం పెంచాలని ఎమ్మెల్యే కొండబాబు సూచించారు.
 
 డీఎడ్ విద్యార్థుల నిరసన
 డీఎస్సీ-14లో తమకూ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ డీఎడ్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు మంత్రులను ముట్టడించారు. జేఎన్‌టీయూకేలో ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేస్తున్న రాష్ర్ట మానవ వనరులశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప లను గేటు వద్ద డీఎడ్ విద్యార్థులు చుట్టుముట్టి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తమకు న్యాయం చేసే వరకు కదలడానికి వీల్లేదంటూ పట్టుబట్టడంతో టెట్ నిర్వహించి క్వాలిఫై అయినవారికి అవకాశం కల్పిస్తామంటూ గంటా హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
 
 ప్రొటోకాల్ ఉల్లంఘనపై తోట మండిపాటు
 లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్‌లీడరయిన తనకు జేఎన్‌టీయూకేలో కనీస గుర్తింపునివ్వడం లేదంటూ కాకినాడ ఎంపీ తోట నరసింహం మండిపడ్డారు. జేఎన్‌టీయూకేలో మంగళవారం చేపట్టిన ప్రారంభోత్సవాలపై తనకు కనీసం మాట మాత్రంగా కూడా చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాల మధ్యలో నుంచే వెనుదిరిగిన తోట జేఎన్‌టీయూకే అధికారుల తీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఎక్కడా తనను ఆహ్వానిస్తూ కనీసం ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన మీడియా వద్ద వాపోయారు. తానేంటో...చూపిస్తానంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ నరసింహం అక్కడ నుంచి వెళ్లిపోయారు.
 
 చొల్లంగి భూములను పరిశీలించిన నారాయణ
 పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు కోసం తాళ్లరేవు మండలం చొల్లంగి వద్ద ప్రతిపాదించిన 57 ఎకరాల స్థలాన్ని రాష్ర్ట మున్సిపల్ శాఖమంత్రి పి.నారాయణ పరిశీలించారు. రాజమండ్రిలో మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ నీతూప్రసాద్, జేసీ ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు, ఏఎస్పీ సత్యనారాయణ, జేఎన్‌టీయూకే వీసీ జి.తులసీరాందాస్, రెక్టార్ బి.ప్రభాకరరావు, రిజిస్ట్రార్ జీవీఆర్ ప్రసాదరాజు, ఓఎన్జీసీ ఈడీ కృష్ణారావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కేవివి సత్యనారాయణరాజు, కెవి రవికిరణ్‌వర్మ, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, పిల్లి అనంతలక్ష్మి, ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, దాట్ల బుచ్చిరాజు, అయితాబత్తుల ఆనందరావు, తోట త్రిమూర్తులు, వేగుళ్ల జోగేశ్వరరావు, పెందుర్తి వెంకటేష్, వంగలపూడి వనిత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పార్టీ బీసీ విభాగం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు