ఇంకా దొరకని ఆ ఏడుగురి ఆచూకీ

15 Jul, 2018 09:50 IST|Sakshi

గోదావరి నదిలో కొనసాగుతున్న సహాయక చర్యలు

సాక్షి, పశువుల లంక (తూర్పు గోదావరి) : గోదావరి నదిలో గల్లంతైన ఆరుగురు విద్యార్థినులు, ఒక మహిళ ఆచూకీ ఇంకా లభించలేదు. పోలవరం మండలం పశువుల లంక వద్ద వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతోంది. అయితే, ప్రతికూల వాతావరణం ఉండటంతో ఆదివారం ఉదయం సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. శనివారం ప్రభుత్వ కార్యక్రమం ‘వనం-మనం’లో పాల్గొని నాటు పడవలో ఇంటికి తిరిగి వస్తూ వీరు గోదావరి నదీ పాయలో ప్రమాదానికి గురయ్యారు. ఆరుగురు విద్యార్థినులు, ఒక మహిళ నీటిలో గల్లంతయ్యారు. అక్కడికి సమీపంలోనే సముద్రం ఉండడంతో వారి ఆచూకీపై ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో మరో 23మంది సురక్షితంగా బయటపడ్డారు. రెండో శనివారం అయినప్పటికీ.. సెలవు రద్దు చేసి.. ‘వనం-మనం’ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలంటూ ఆదేశాలు ఇవ్వడం ఆ చిన్నారుల పాలిట మృత్యుపాశంగా మారింది. పిల్లల ఆచూకీ కోసం రాత్రంతా ఘటనాస్థలంలోనే ఉన్న తల్లిదండ్రులు వారి కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్రంలో కేవలం 8 నెలల వ్యవధిలో 4 ఘోర పడవ ప్రమాదాలు జరగడం గమనార్హం.

కొనసాగుతున్న సహాయక చర్యలు
ఆదివారం ఉదయం వర్షంలోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డైవర్స్‌ నీళ్లలోకి దిగి గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. గోదావరి దిగువన సముద్రంలో కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. గోదావరి పొడవునా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు బృందాలుగా విడిపోయి.. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలిస్తున్నాయి. పిల్లలు ఆచూకీ కోసం తల్లిదండ్రులు, వారి బంధువులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ నేతలను ఆదేశించారు.

మరిన్ని వార్తలు