శోకసంద్రం.. గోదారి తీరం 

17 May, 2018 04:52 IST|Sakshi
లాంచీలో చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీస్తున్న సహాయక సిబ్బంది (ఇన్‌సెట్‌లో) రోదిస్తున్న మృతుల బంధువులు

     లాంచీ ప్రమాదంలో 26 మంది మృతి!

     20 గంటల పాటు లాంచీలోనే మృతదేహాలు 

     15 మృతదేహాల వెలికితీత 

     ఇంకా లభించని 11 మంది ఆచూకీ.. బంధువుల్లో ఆందోళన 

     అధికారిక లెక్కల ప్రకారం సురక్షితంగా ఒడ్డుకు చేరింది 16 మంది 

     లాంచీలో 58 మంది ఉన్నారంటున్న ప్రత్యక్ష సాక్షులు 

     మిగతావారి ఆచూకీపై అయోమయం

సాక్షి ప్రతినిధి కాకినాడ/ పోలవరం/కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపాన గోదావరిలో లాంచీ మునిగిపోయిందనే వార్త ఉభయ గోదావరి జిల్లాలను వణికించింది. తమ వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి తరలివచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్, నౌకాదళ సిబ్బంది ఒక్కొక్కటిగా మృతదేహాలను వెలికితీస్తుంటే.. వాటిని గుర్తించిన బంధువుల రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. బుధవారం రెస్య్కూటీం మొత్తం 15 మృతదేహాలను బయటకు తీసింది. ఇంకా 11 మంది ఆచూకీ లేనట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వారికి ఫిర్యాదులు అందాయి. అధికారిక లెక్కల ప్రకారం మరో 16 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అంటే  లాంచీలో 42 మంది ఉన్నట్టు అధికారికంగా తెలుస్తుండగా,  సుమారు 58 మంది లాంచీలో ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంటే అనధికార లెక్కల ప్రకారం మరో 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఎన్‌డీఆర్‌ఎఫ్, నౌకాదళ సిబ్బంది, స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

రెండోరోజూ కొరవడిన స్పష్టత 
ప్రమాదానికి గురైన లాంచీలో అసలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది గల్లంతయ్యారు? అనే విషయంలో బుధవారం రెండోరోజు కూడా ఒక స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి చినరాజప్పలు సంఘటన ప్రాంతాన్ని సందర్శించినా ప్రయాణికులు, మృతుల సంఖ్యపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. హోం మంత్రి ఒకసారి 48 మంది, మరోసారి 39 మంది ప్రయాణికులు ఉన్నట్టు చెప్పారు. దీంతో ఆచూకీ తెలియకుండా పోయినవారి కోసం వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. 

అధికలోడే కారణం..! 
లాంచీ మునిగిపోవడానికి సామర్థ్యానికి మించిన ప్రయాణికులు, సిమెంటు, బియ్యం బస్తాల వంటి అధిక లోడే కారణంగా అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులతో పాటు సుమారు 50 సిమెంటు బస్తాలు, మరికొన్ని బియ్యం బస్తాలు, కూరగాయల సంచులు, కిరాణా సామాన్లు, ప్రయాణికులు లగేజీ లాంచీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్‌డీఆర్‌ఎఫ్, నావీ సిబ్బంది ఇరవై గంటల అనంతరం నదిలో మునిగిన లాంచీని భారీ క్రేన్‌ల సాయంతో వెలికితీశారు. లాంచీ పూర్తిగా నేలపైకి రావడానికి వీలుకాక పోవడంతో నేవీ సిబ్బంది లాంచీ భాగాలను కత్తిరించి మృతదేహాలు బయటికి తీశారు. లాంచీ వెలికితీతలో జాప్యంపై స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.  

ముఖ్యమంత్రి పరామర్శ 
సీఎం చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన ఒక్కొక్కరికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు సాయం అందిస్తామని ప్రకటించారు. మృతుల కుటుంబాల్లో చదువుకున్న వారుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇటువంటి ప్రమాదాలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా ఈ ప్రాంతానికి రోడ్డు సదుపాయం లేకపోవడం మూలంగానే ప్రమాదం బారిన పడాల్సి వచ్చిందని చంద్రబాబు వద్ద స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు సాయం ప్రకటించిన వైఎస్సార్‌ సీపీ 
లాంచీ ప్రమాద ఘటనా స్థలాన్ని బుధవారం వైఎస్సార్‌ సీపీ పరిశీలన కమిటీ సందర్శించింది. ప్రజా సంకల్ప పాదయాత్రలో ఉన్న పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే ఈ ఘటనపై స్పందించి పార్టీ తరఫున బాధిత కుంటుబాలకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్ధికసాయం అందిస్తామని చెప్పినట్టు పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, రాష్ట్ర ఎస్టీసెల్‌ అధ్యక్షుడు తెల్లం బాలరాజు తెలిపారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు