కల్లోల కడలి!

31 Jul, 2018 13:31 IST|Sakshi
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగాడ లక్ష్మణరావు

ఇద్దరు మత్స్యకారులకు తీవ్ర గాయాలు

స్వల్పంగా గాయపడిన మరో పదిమంది..

వణికిపోయిన తీర ప్రాంత గ్రామాలు

శ్రీకాకుళం : తీరంలో మరోమారు ‘అల’జడి రేగింది. ఇటీవల సోంపేట తీరంలో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడిన ఘటనలో ఒకరు చనిపోవడం.. ఏడుగురు గాయపడిన ఘటన జిల్లావాసులు కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉంది. అలాంటి పరిస్థితే సోమవారం గార మండలంలో చోటు చేసుకుంది. అలల ఉద్ధృతికి ఏడు బోట్లు బోల్తా పడిపోయాయి. ఈ ఘోరంలో మైలపల్లి లక్ష్మణ, గంగట్ల లక్ష్మణ తీవ్రంగా...మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు.

బోట్లు బోల్తాపడిన సమాచారంతో తీర ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. చేపల వేట కోసం వెళ్లిన తమవారు ఎలా ఉన్నారోనని భీతిల్లిపోయారు. అదృష్టవశాత్తు అంతా క్షేమంగా ఉన్నారని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.గార: వాతావరణంలో మార్పుల నేపథ్యంలో కొద్ది రోజులుగా మత్స్యకారులు ఎవరూ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లడం లేదు. అయితే రోజుల తరబడి వేటకు వెళ్లకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను జలపుత్రులు ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలోనే సోమవారం కొంతమంది ధైర్యం చేసి బోట్లపై వేటకు బయలు దేరారు. అయితే అలల హోరులో వారి సాహసం పని చేయలేదు. దీంతో తీరానికి వచ్చేయాలనే తాపత్రయంలో ప్రమాదంలో చిక్కుకున్నారు. అందరినీ అందోళనకు గురి చేశారు. వివరాల్లోకి వెళితే.. బందరువానిపేట, మొగదాలపాడు గ్రామాల్లో 174 ఇంజిన్‌ బోట్లు ఉన్నాయి. మత్స్యకార పెద్దలకు తెలియకుండా ఈ రెండు గ్రామాలకు చెందిన సుమారు 56 మంది 11 బోట్లపై సోమవారం వేకువజామున సముద్రంలోకి వేటకు వెళ్లారు.

అప్పటికే సముద్రంలో గాలుల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో వేట సురక్షితం కాదని భావించి తీరానికి తిరుగుముఖం పట్టారు. ఈ ప్రయత్నంలోనే బందరువానిపేట తీరానికి చెందిన ఐదు, మొగదాలపాడు గ్రామానికి చెందిన రెండు పడవలు సముద్రంలో బోల్తాపడిపోయాయి. అయితే మత్స్యకారులంతా వాటిని గట్టిగా పట్టుకొని ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఈ సంఘటనలో ఇద్దరు తీవ్రంగా.. మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు. అలాగే మరో నాలుగు పడవుల్లో ఉన్నవారంతా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయి. 

గాలి హోరు.. అలల ఉద్ధృతి కారణంగా బందరువానిపేట తీరం నుంచి ఉదయం 7 గంటల సమయంలో బోట్లపై నుంచి వెనక్కి వస్తున్న గంగట్ల లక్ష్మణ బోటు ఒడ్డుకు చేరుకునే ప్రయత్నంలో పెద్ద ఎత్తున పైకెగిసిన అలకు బోల్తా కొట్టింది. దీంతో లక్ష్మణరావుతో  పాటు అందులో ఉన్న మైలపల్లి లకు‡్ష్మయ్యకు గాయాలయ్యాయి. వీరిని అదే బోటులో మిగిలిన మత్స్యకారులు అత్యంత కష్టంపై ఒడ్డుకు చేర్చారు. అనంతరం శ్రీకాకుళంలోని ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.

ఇదే సమయంలో పడవ బోల్తా పడిన సంఘటన 5 వేలు జనాభా కలిగిన బందరువానిపేట గ్రామంలో దావానంలో వ్యాపించడంతో కలకలం రేగింది. ఏఏ బోట్లు సముద్రంలోకి వెళ్లాయి. ఎంతమంది వెళ్లారన్న సంగతి వారి కటుంబ సభ్యులు తీరానికి వచ్చేంతవరకు తెలియని పరిస్థితితో అందరిలో ఆందోళన రేగింది. 9 గంటల సమయం నుంచి  సముద్రంలో గాలుల తీవ్రతతో పాటు అలల ఉద్ధతి కొంత తగ్గడంతో మిగిలిన బోట్లలో ఉన్నవాంతా ఒడ్డుకు వచ్చేందుకు ప్రయత్నించారు.

బందరువానిపేటకు చెందిన శివకోటి లక్ష్మణరావు, కొమర తాతారావు, మురమంద చిన్నారావు, దుమ్ము కృష్ణలకు చెందిన నాలుగు పడవులు ఒకదాని తర్వాత ఒక్కక్కటి ఒడ్డుకు వచ్చే ప్రయత్నంలో మళ్లీ అలలు ఉద్ధృతి పెరగడంతో బోల్తా పడ్డాయి. మరో నాలుగు పడవులు అలకి అలకి మధ్య ఉన్న తక్కువ క్షణాల వ్యవధిలో సురక్షితంగా మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు.

బోల్తా పడిన పడవుల్లో ఉన్న ఇద్దరు మత్స్యకారులు గాయాలపాలవ్వడం, మరో 10 మంది శ్వాస సంబంధిత ఇబ్బందులు కలగడంతో వారిని చికిత్స కోసం స్థానిక వైద్యాధికారి సుమన్‌ 108 వాహనంలో శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటనలో నాలుగు ఇంజిన్లు పాడవ్వగా, 5 వలలు, రెండు జామితాళ్లు గల్లంతాయ్యాయి. మత్స్యశాఖ అధికారి శాంతారావు సంఘటన స్థలానికి వచ్చి  బాధితుల వివరాలను సేకరించారు. జరిగిన నష్టాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.  

మొగదాలపాడు నుంచి బందరువానిపేట తీరానికి..

మొగదాలపాడు గ్రామానికి చెందిన చీకటి శ్రీరాములు, చీకటి సూర్యనారాయణ పడవుల్లో 8 మంది వేటకు బయలుదేరారు. ఆ పడవులు  రెండు సముద్రంలో ఉన్న విండ్‌తో బందరువానిపేట తీరం వరకు వచ్చేశారు. 11 గంటల సమయంలో బందరువానిపేట పడవులు ఒడ్డుకు వెళ్లే ప్రయత్నం గమనించిన మొగదాలపాడు మత్స్యకారులు కూడా ఒడ్డుకు వచ్చే ప్రయత్నంలో వారి పడవలు కూడా బోల్తా పడ్డాయి. అయితే వీటిలో ఉన్నవాంతా  సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

మరిన్ని వార్తలు