రేపటి నుంచి ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట

28 Sep, 2019 18:39 IST|Sakshi

ధర్మాడి సత్యం కు లాంచీ వెలికితీత పనులు అప్పగింత

సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): గోదావరిలో మునిగిన రాయల్‌ వశిష్ట బోటు వెలికితీతకు రేపటి (ఆదివారం) నుంచి ఆపరేషన్‌ ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లాంచీని వెలికితీస్తామని కొందరు ముందుకు వచ్చారని.. వారు ఇచ్చిన సలహాలపై కమిటీ వేశామన్నారు. కమిటీ సూచన మేరకు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం(బాలాజీ మెరైన్‌)కు లాంచీ వెలికితీత పనులు అప్పగించామని వెల్లడించారు. గత పది రోజులకు పైగా లాంచీ మునిగిన ప్రదేశంలో ఈ బృందం ఉండటంతో అక్కడి పరిస్థితులపై వారికి అవగాహన వచ్చిందన్నారు. వెలికితీత కోసం రూ.22.70 లక్షల వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చామని కలెక్టర్‌ చెప్పారు.

ఆపరేషన్‌లో పాల్గొనే ప్రతిఒక్కరికి రిస్క్‌ కవరేజ్‌ ఉండాలని.. పూర్తి భద్రత చర్యలు తీసుకోవాలని సూచించామని తెలిపారు. తాడు సాయంతో లాంచీ వెలికి తీస్తానని సోషల్‌ మీడియాలో తెలిపిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి కూడా ఈ ఆపరేషన్‌కు సహకరిస్తానని తెలిపారని కలెక్టర్‌ వెల్లడించారు. ఇంకా ఆచూకీ లభించాల్సిన 15 మంది పర్యాటకుల డెత్‌ సర్టిఫికెట్ల జారీ కోసం ప్రత్యేక అనుమతులు ఇచ్చామని చెప్పారు. గోదావరిలో ఇంకా రెస్క్యూ బృందాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్‌ తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు