నిర్లక్ష్యమే శాపమైంది

16 Jul, 2018 02:24 IST|Sakshi
ప్రమాదానికి గురైన పడవ

లక్షల ఆదాయం వస్తున్నా పడవ మరమ్మతులపై అలసత్వం

ఇంజిన్‌ ఫ్యానుకు ఉన్న ఒకటిన్నర రెక్కతోనే రవాణా

సాక్షి, రాజమహేంద్రవరం: ప్రతి రోజూ తమను నదిని దాటించే పడవే తమ కుటుంబాల్లో కన్నీళ్లను నింపుతుందని లంక గ్రామాల వాసులు భావించలేదు. పడవ నిర్వాహకుడి నిర్లక్ష్యం వల్ల బాధితుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. లంకల్లోని కుటుంబాల వద్ద ఏటా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా పడవ నిర్వహణను గాలికొదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన పడవ పరిశీలిస్తుంటే నిర్లక్ష్యపు జాడలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పడవలో ఇంజిన్‌ ఫ్యానుకు ఉండాల్సిన మూడు రెక్కలకు బదులుగా ఒకటి మాత్రమే ఉంది. మరో రెక్క సగం మేర విరిగి ఉంది. ఇలా ఒకటిన్నర రెక్క ఉన్న ఇంజిన్‌తోనే పడవను నడుపుతున్నారు. పాతకాలం నాటి ఇంజిన్, పలుమార్లు ప్రయత్నిస్తేగాని స్టార్ట్‌ కాదు.

ఇలాంటి ఇంజిన్‌ పడవలో 12 వందల కుటుంబాలను నది దాటిస్తున్నారు. ప్రతి రోజూ దాదాపు 200 మంది విద్యార్థులు ఆ పడవలోనే నది దాటుతూ ఉంటారు. శనివారం పడవ బయలుదేరడం ఒక్క నిమిషం ఆలస్యమైనా.. ప్రైవేటు స్కూల్లో చదువుతున్న మరో 25 మంది చిన్నారులు ఆ పడవలో ప్రయాణించి ఉండేవారు. ఈ విషయాన్ని తలుచుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ఉలిక్కిపడుతున్నారు. కమిని, వలసలతిప్ప, పొట్టితిప్ప, సలాదివారిపాలెం, శేరిలంక, శ్రీరామపురం, పిల్లెంక, కొత్తలంక, గురజాపలంక తదితర లంకల్లో 1,200 కుటుంబాలు నివశిస్తున్నాయి. వీరందరూ పుశువుల్లంక వద్ద గోదావరి దాటితేగానీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు. పశువుల్లంక నుంచి మరో 3కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణిస్తే మురమళ్ల వద్ద కాకినాడ–అమలాపురం ప్రధాన రహదారిపైకి చేరుకుంటారు.

వీరిని  నది దాటించి, తీసుకువచ్చేందుకు ఏడాదికి గుంపగుత్తగా పడవ నిర్వాహకుడు డబ్బు వసూలు చేస్తున్నారు. ఇందుకుగాను ప్రతి ఏటా ఫిబ్రవరిలో పశువుల్లంక పంచాయతీ పెద్దలు వేలంలో కొంత మొత్తానికి ఈ పనిని కేటాయిస్తున్నారు. ఈ ఏడాది కొత్తలంకకు చెందిన వెంకటేశ్వర్లు వేలంలో పడవ నిర్వహణను దక్కించుకున్నారు. మోటారు సైకిల్‌ ఉన్న కుటుంబానికి ఏడాదికి రూ.1,800, మోటారు సైకిల్‌ లేని వారికి రూ. 800 చొప్పున ధర నిర్ణయించారు. ఈ లెక్కన ఏటా రూ.12 లక్షలు వసూలు చేస్తున్నారని లంక గ్రామాల ప్రజలు చెబుతున్నారు. దీనికి అదనంగా సంత రోజైన బుధవారం ప్రతి ఒక్కరూ రూ. 10 అదనంగా చెల్లించాలి. ఈ స్థాయిలో ఆదాయం వస్తున్నా కూడా పడవ నిర్వహణలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు.

మరిన్ని వార్తలు