నట్టనడుమ.. చిమ్మచీకట్లో...

10 May, 2019 01:28 IST|Sakshi

గోదావరి మధ్యలో నిలిచిన పంటు 

పంటులో 93 మంది ప్రయాణికులు

రెండున్నర గంటలు హాహాకారాలు 

50కి మించి అనుమతిలేదు..  కానీ, రెండు కార్లతోపాటు

90మందికి పైగా ఎక్కిన వైనం 

పశ్చిమ గోదావరి జిల్లా మాధవాయిపాలెం వద్ద ఘటన

నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం  మాధవాయిపాలెం రేవు వద్ద గోదావరి నదిలో గురువారం రాత్రి పంటు నిలిచిపోయింది. పంటులో ఆయిల్‌ అయిపోవడంతో చిమ్మచీకటిలో గోదావరి మధ్యలో పంటు నిలిచిపోయింది. ఆ సమయంలో పంటుపై 93 మంది ప్రయాణికులు, రెండు కార్లు ఉన్నాయి. సముద్రపుపోటు కారణంగా పంటు అదుపు తప్పి లాకురేవు వైపు వెళ్లిపోయింది. చివరకు అక్కడ మత్స్యకారులు కట్టిన వలకట్ల వద్ద నిలిచింది. రాత్రి 8 గంటలకు మాధవాయిపాలెం రేవు నుంచి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవుకు పంటు బయల్దేరింది. అయితే, ఆయిల్‌లేక గోదావరి మధ్యలోకి వెళ్లగానే పంటు నిలిచిపోయింది. సముద్రపోటు తో పంటు వేరేమార్గంలోకి వెళ్లి పోతుండటంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. 

రెండున్నర గంటలు గోదావరిలోనే.. 
పంటులో ఉన్న మహిళలు రక్షించండంటూ పెద్దగా అరిచారు. బంధువులకు సెల్‌ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో వారు కూడా పెద్ద సంఖ్యలో రేవు వద్దకు చేరుకున్నారు. నరసాపురం ఆర్డీవో ఏఎన్‌ సలీంఖాన్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రయాణికులతో ఫోన్‌లో మాట్లాడారు. రాత్రి 10.15 గంటలకు ఆయిల్‌ను వేరే పడవలో తీసుకెళ్లి పంటును అవతల గట్టుకు చేర్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. రేవు నిర్వహణపై చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. తరచూ ఇలాగే జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. అసలు ఆయిల్‌ సమస్య కాదని, ఫిట్‌గా లేని పంటును ఉపయోగించారనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ, ఈ విషయాన్ని దాస్తున్నట్టుగా చెబుతున్నారు. పంటులో లైఫ్‌ జాకెట్లు ఏమీలేవు. పంటులో 50 మందికి మించి ఎక్కించడానికి అనుమతిలేదు. కానీ, పరిమితికి మించి 90 మందికి పైగా జనాన్ని, 2 కార్లను అదీ రాత్రివేళ అనుమతించారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా