అవయవదానంపై ఆదర్శ ‘మార్గం’

9 Mar, 2016 12:59 IST|Sakshi
కొవ్వూరు రమేష్‌రెడ్డిని అభినందిస్తున్న డాక్టర్ చింతా రామకృష్ణ
  • 460 కి.మీ. నడుచుకుంటూ గుంటూరుకు వచ్చిన కడప వాసి
  • గుంటూరు మెడికల్: రమేష్‌రెడ్డి.. అవయవదానం వల్ల ఈ రోజు ప్రాణాలతో ఉన్నాడు. తన లాగా ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని రక్షించడానికి.. ప్రాణాలు పోయిన తరువాత కూడా ‘ఇతరుల్లో’ బతకడానికి అవయవదానం ఎంత అవసరమో తెలియజేయడానికి నడుం బిగించాడు ఈ వైఎస్సార్ జిల్లా వాసి. ప్రజల్లో అవయవదానంపై ఉన్న అపోహలు తొలగించి వారికి అవగాహన కల్పించేందుకు ప్రొద్దుటూరుకు చెందిన కొవ్వూరు రమేష్‌రెడ్డి కాలినడకన తిరుపతి నుంచి బయలుదేరి దారిపొడవునా ప్రతి ఒక్కరికీ అవయవదానంపై అవగాహన కల్పిస్తూ మంగళవారం గుంటూరు వచ్చారు.

    ఫిబ్రవరి 12న తిరుపతిలో బయలుదేరిన రమేష్‌రెడ్డి 460 కిలోమీటర్ల ‘స్ఫూర్తి మార్గం’ అనంతరం గుంటూరు రావడంతో పలువురు వైద్యులు ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్‌రెడ్డి మాట్లాడుతూ లివర్ వ్యాధితో బాధపడుతున్న తాను 2003లో లివర్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నానని నేటికి 13 ఏళ్లు గడుస్తున్నా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. 2009లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా జరిగిందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని, ప్రజలు అవయవదానంపై అపోహలు వీడాలని పిలుపునిచ్చారు. సన్మాన కార్యక్రమంలో వేదంత మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ చింతా రామకృష్ణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ గొంది శివరామకృష్ణ, డాక్టర్ డేగల వాణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు