నేటి నుంచి ఎస్‌ఐ నియామక దేహదారుఢ్య పరీక్షలు

21 Jan, 2019 13:18 IST|Sakshi
కర్నూలు ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న డీఐజీ నాగేంద్రకుమార్, ఎస్పీ ఫక్కీరప్ప

సీసీ కెమెరాల నిఘా, పటిష్ట బందోబస్తు  

సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహణ

ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ, ఎస్పీ

కర్నూలు : రాయలసీమ జోన్‌ ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, డిప్యూటీ జైలర్, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ నియామకాలకు సంబంధించి సోమవారం నుంచి దేహదారుఢ్య పరీక్షలు కర్నూలులోని ఏపీఎస్‌పీ రెండో పటాలంలో ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 5గంటల నుంచి వీటిని నిర్వహించనున్నారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఆటోమెటిక్‌గానమోదు చేసే ఏర్పాట్లను చేశారు. ఈ సాప్ట్‌ సొల్యూషన్స్‌ సంస్థకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం కర్నూలు రేంజి డీఐజీ నాగేంద్రకుమార్, ఎస్పీ ఫక్కీరప్ప పరిశీలించారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల ఎస్పీలు కూడా ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు. గత నెల 16వ తేదీన నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో 14,525 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికయ్యారు. ఇందులో 13,290 మంది పురుషులు, 1235 మంది మహిళలున్నారు. ప్రతి రోజూ 600 నుంచి 800 మంది అభ్యర్థుల వరకు హాజరు కానున్నారు. ఉదయం ఐదుగంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఇందులో ఉత్తీర్ణలైన వారు ఫిబ్రవరి నిర్వహించనున్న రాత పరీక్షకు ఎంపికవుతారు. 

సర్టిఫికెట్‌ లేకపోతే అనుమతి నిరాకరణ : డీఐజీ
దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా కేటాయించిన సమయానికి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు గెజిటెడ్‌ ఆఫీసర్‌తో అటెస్టేషన్‌ చేయించిన కాపీ సెట్లతో హాజరు కావాలని సూచించారు. సర్టిఫికెట్లు లేని అభ్యర్థులను ఫిజికల్‌ మెజర్‌మెంట్స్, ఫిజికల్‌ ఎఫిషియన్సీ (పీఈటీ) పరీక్షలకు అనుమతించేది లేదని పేర్కొన్నారు. ఫిజికల్‌ మెజర్‌మెంట్స్‌ పరీక్షల్లో ఏవైనా అప్పీలు చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 6వ తేదీ తన కార్యాలయంలో సంప్రదించాలని డీఐజీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్‌ ఐపీఎస్‌ అధికారి విద్యాసాగర్‌నాయుడు, రెండో పటాలం కమాండెంట్‌ హుస్సేన్‌సాహెబ్, అదనపు ఎస్పీలు మాధవరెడ్డి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు శ్రీనివాసులు, హుస్సేన్‌పీరాతో పాటు ఇతర జిల్లాల డీఎస్పీలు, సీఐలు ఆర్‌ఎస్‌ఐలు ఈ కాప్స్‌ ఇన్‌చార్జి రాఘవరెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి అబ్దుల్‌ ఖాదర్, డీఐజీ మేనేజర్‌ సురేష్, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు