నకిలీ 'బయోం'దోళన 

6 Oct, 2019 10:04 IST|Sakshi

ఆదోని పట్టణం ఆలూరు రోడ్డులోని ఓ పాత భవనంలో న్యూ ఇండియా క్రాప్‌ సైన్స్‌ పేరుతో పైరు ఎదుగుదలకు తోడ్పడే పోషకాల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ద్రవ, గుళికలు తయారు చేసి మార్కెట్‌లోకి పంపుతున్నారు. గత నెల 26వ తేదీన వ్యవసాయాధికారులు దాడులు నిర్వహించగా.. తయారు చేస్తున్న బయో మందుల్లో రసాయనాలు ఉన్నట్లు తేలింది. దాదాపు రూ.50 లక్షల విలువైన ఉత్పత్తులను సీజ్‌ చేశారు. జిల్లాలో విక్రయిస్తున్న అనేక బయో మందులు నకిలీవేనని తెలుస్తోంది. 

సాక్షి, కర్నూలు : బయో మందులు.. పైరు ఏపుగా పెరగడానికి, మంచి పూత రావడానికి రైతులు వాడుతున్నారు. అన్నదాతల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ వ్యాపారులు.. నకిలీలను అంటగడుతున్నారు. వీటిని వాడితే మొక్క తన సహజ లక్షణాలు కోల్పోతుంది. పచ్చగా ఏపుగా పెరిగినా.. పూత, కాపు రాక రైతు నష్టపోవాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో పైరు ఎరుపు రావడంతోపాటు పూతకూడా రాలుతుంది. వీటి దుష్పరిణామాలను నివారించేందుకు ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడినా ప్రయోజనం ఉండబోదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ ఆశాజనకంగా ఉంది. అత్యధికంగా పత్తి 2,63,595 హెక్టార్లలో సాగైంది. పైరు వివిధ దశల్లో ఉంది. పూత బాగా రావాలని చాలా మంది రైతులు  బయో మందులు వాడుతున్నారు. అవి నకిలీవని తెలియక మోసపోతున్నారు. కంది 63,906, కొర్ర 6,455, సజ్జ 5,683, మినుము 1,953, ఆముదం 16,653, మిరప 10,882 హెక్టార్లలో సాగయ్యాయి. మంచి దిగుబడులు రావాలనే ఆశతో వాటికి కూడా రైతులు బయో మందులను వాడుతున్నారు.      

మోసాలు ఇలా చేస్తున్నారు... 
బయో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు 2004లో రాష్ట్రంలో ఐదు మాత్రమే ఉండేవి. నేడు అవి వందల సంఖ్యకు పెరిగిపోయాయి. నిబంధనల ప్రకారం బయో ఉత్పత్తులు అమ్మకోవాలంటే ముందుగా వ్యవసాయశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇందు కోసం దరఖాస్తు చేసుకుంటే వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ నుంచి ప్రత్యేక అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహిస్తారు. అన్నీ సంతృప్తికరంగా ఉంటేనే అనుమతులు ఇస్తారు. ఏవైనా బయో ఉత్పత్తులు అమ్ముకోవాలంటే కేంద్రం/ రాష్ట్రానికి చెందిన ప్రయోగశాలు ధ్రువీకరించిన సర్టిఫికెట్లు ఉండాలి.

ఆ ఉత్పత్తుల్లో ఏయే పోషకాలు.. ఎంతెంత మోతాదులో ఉన్నాయనేది ప్రయోగశాలల్లో నిర్ధారిస్తారు. ప్రయోగశాలలో ధ్రువపత్రాలు లేకుండా బయో మందులు అమ్మడానికి అవకాశం లేదు. ఈ మేరకు వ్యవసాయ శాఖ నుంచి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని ఎక్కడా పాటించడం లేదు. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో బయో కంపెనీలు 75 ఉన్నాయి. అయితే అనధికారికంగా నడుస్తున్న బయో కంపెనీలు వంద వరకు ఉన్నట్లు అంచనా. చైనా నుంచి విషపూరిత రసాయనాలు దిగుమతి చేసుకొని.. బయో ఉత్పత్తుల పేరుతో రైతులను ఈ కంపెనీలు ముంచుతున్నాయి. 

కోట్లాది రూపాయల వ్యాపారం... 
బోగస్‌ కంపెనీలు తప్పుడు అడ్రస్‌లు, గ్రాఫిక్‌ లేబుళ్లతో బయో మందులను సృషిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నా పట్టించుకనే వారు కరువయ్యారు. కొంతమంది వ్యవసాయాధికారుల కుటుంబీకులే అక్రమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు, మంత్రాలయం, నంద్యాల, ఎమ్మిగనూరు, కోసిగి, గోనెగండ్ల, డోన్, ఆదోని, నందికొట్కూరు, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లో దొంగ బయో ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా వీటిని విక్రయిస్తున్నారు. కర్నూలు కొత్త బస్టాండు సమీపంలోని పెస్టిసైడ్‌ బయో పెస్టిసైడ్‌ దుకాణాలు ఉన్నాయి. వీటిల్లో దొంగ బయో ఉత్పత్తులకు ఒక బిల్లు బుక్కు, కంపెనీలకు ఉత్పత్తులకు మరో బిల్లు బుక్‌ నిర్వహిస్తూ జీరో వ్యాపారం చేస్తున్నారు. జిల్లాలో ఏడాదికి రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది.   

నకిలీలను ఎలా తెలుసుకోవాలంటే... 
భూమిలో నుంచి మొక్క వేరు ప్రాంతంలోని మట్టిని సేకరించి దాని నుంచి సూక్ష్మ జీవులను ఉత్పత్తి చేస్తారు. అందులో మనుషులు, మొక్కలు, పశుసంపదకు హాని, కీడు చేసే వాటిని, వాటి లక్షణాలను బట్టి వేరుచేసి జీవ సాంకేతిక ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయాల్సి ఉంది. పులియ బెట్టే విధానంలో బయో మందులు తయారు చేస్తారు. ఇవి చేతిమీద పోసుకుంటే దురుద రాదు. ముక్కు మంటపుడితే అది నకిలీదిగా భావించాలి. నీళ్లలో పోస్తే నురగ రాకూడదు. నేలమీద పడితే వెంటనే ఆరిపోకూడదు. చీమలు, తేనెటీగలు తిన్నా చనిపోకూడదు. ఈ లక్షణాలను గమనిస్తే బయో మందులని నిర్ధారించుకోవచ్చు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా