అన్నిమండలాల్లోనూ...బోగస్ రచ్చ !

17 Sep, 2014 02:18 IST|Sakshi
అన్నిమండలాల్లోనూ...బోగస్ రచ్చ !

 ఆధార్ అనుసంధానంతో బోగస్ కార్డులు వెలుగుచూస్తున్నాయి. రచ్చబండ సభల్లో పంపిణీ చేసిన సుమారు 48 వేల కార్డుల్లో 8,493 కార్డులను బోగస్ కార్డులుగా అధికారులు గుర్తించారు. ఈ బోగస్ ‘రచ్చ’ అన్ని మండలాల్లోనూ వెలుగు చూసింది. ఆధార్ అ నుసంధానం పూర్తయిన తరువాత తెల్లరేషన్ కార్డుల్లో ఎన్ని బోగస్ కార్డులున్నాయో బయటపడనుంది.
 
 విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో అన్ని మండలాల్లోనూ బోగస్ కార్డులున్నట్టు తేలింది. అయితే ప్రస్తుతానికి రచ్చబండలో  మంజూరు చేసిన కార్డుల వ్యవహరం బయటపడింది. ఇక పెద్ద సంఖ్యలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుల బాగోతం కూడా త్వరలో తేటతెల్లంకానుంది.  ప్రస్తుతానికి రచ్చబండ వేదికగా మంజూరు చేసిన  రేషన్ కార్డుల్లో బోగస్ వివరాలు బయటపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 8,493  బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టు తేలింది. 34 మండలాల్లోనూ బోగస్ కార్డులుండడం విశేషం. రాజకీయ ప్రయోజనాల కోసం అప్పట్లో ఇబ్బడిముబ్బడిగా కార్డులు మంజూరు చేశారు.   జిల్లాలో ఉన్నవారు,లేనివారు అన్న తేడా లేకుండా కార్డులు మంజూరుచేశారు.
 
 జిల్లాలో శాశ్వత నివాసం ఉండీ ఇతర ప్రాంతాల్లో రేషన్ కార్డులు పొందడంతో ఈ కార్డులు బోగస్‌విగా గుర్తించారు. ప్రస్తుతం ఈ నెల నుంచి ఈ కార్డులకు రేషన్ నిలిపివేశారు. ఇంత వరకూ ఈ కార్డులకు   మంజూరయిన రేషన్ ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది.  నెల్లిమర్ల,గుర్ల, భోగాపురం మండలాల్లో రచ్చబండ బోగస్‌కార్డులు అధికంగా ఉన్నట్టు   బయటపడింది. నెల్లిమర్లలో 687, గుర్లలో 645, భోగాపురంలో 610 కార్డులుండగా,  తక్కువగా  పాచిపెంట  మండలంలో  20 మాత్రమే బోగస్ కార్డులున్నట్టు తేలింది.   ఇవి కేవలం రచ్చబండ రేషన్ కార్డుల లెక్క మాత్రమే.  ఇక తెలుపు రేషన్ కార్డుల్లో ఎన్ని బోగస్‌వి ఉన్నాయో గుర్తించాలంటే మరికొద్ది రోజులాగాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం జిల్లాలో ఆధార్ సీడింగ్ ప్రక్రియ 80.90 శాతం జరిగింది.
 
 గతంలో ప్రతీ రోజూ 30 నుంచి 35 వేల దాకా యూనిట్ల ఆధార్ సీడింగ్ ప్రక్రియ జరుగుతుండేది. తరువాత అది పది నుంచి 15 వేలకు పడిపోయింది. నిత్యం అధికారులు ఒత్తిడి తెస్తున్నా ఇప్పుడది 5 నుంచి ఆరు వేలకు మాత్రమే జరుగుతోంది. మరి కొద్దిరోజుల్లో సీడింగ్‌ప్రక్రియ నిలిచిపోనుంది. ఎందుకంటే మిగిలినవి బోగస్ కార్డులే అయ్యి ఉంటాయని, అందుకే సీడింగ్‌కు తీసుకురావడం లేదన్న  అనుమానాలు అధికారులకు  కలుగుతున్నాయి.  జిల్లా వ్యాప్తంగా  85 శాతమే  ఆధార్ సీడింగ్ జరిగే అవకాశం ఉంది.  దీంతో మిగతా 15 శాతం రేషన్ కార్డులు బోగస్‌వేనని తెలుస్తోంది.    జిల్లాలో ఉన్న 5,40,849 తెల్ల కార్డుల్లో 81,127 రేషన్ కార్డులు  బోగస్ వేనని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు