ఒక్కో నియోజకవర్గంలో 10,000 ఓట్ల తొలగింపే లక్ష్యం

27 Jan, 2019 04:10 IST|Sakshi
జలుమూరు పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న ఓటర్ల సర్వే బృందం

శ్రీకాకుళం జిల్లాలో పట్టుబడిన బోగస్‌ సర్వే బృందాలు 

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్ర 

18 ప్రశ్నలకు సమాధానాల సేకరణ 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాధానం చెబితే ఓటు గల్లంతే 

ఇతర జిల్లాల నుంచి నిపుణులను రప్పిస్తున్న అధికార పార్టీ నేతలు 

జలుమూరు: ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లాలో బోగస్‌ సర్వేలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక అధికా పార్టీ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓట్ల తొలగింపు కోసం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులను కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి రప్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు, నరసన్నపేట, కొత్తూరు, పలాస తదితర మండలాల్లో శనివారం పలు బృందాలు సర్వే చేశాయి.

జలుమూరు మండలం పెద్దదూగాం, టి.లింగాలుపాడు, నరసన్నపేట మండలం పారిశిల్లి, బసివలస, సుందరాపురం, బాలసీమ గ్రామాల్లో పలువురు యువకులు సర్వే చేస్తుండగా వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన కృష్ణచైతన్య, మూకళ్ల సత్యం, వాన నాగేశ్వరరావు  వారిని పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.  సర్వే బృందం సభ్యులు పలు వివరాలు వెల్లడించారు. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన బి.భాస్కర్‌ ఈ బృందానికి నాయకుడిగా వ్యవహారిస్తున్నాడు. గ్రామాల్లో సర్వే పేరిట ఓటర్ల్లను కలిసి వారు అధికార టీడీపీకి చెందిన వారయితే వారిని విడిచిపెట్టి, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే సర్వే లక్ష్యమని బి.భాస్కర్‌ చెప్పాడు. 

ఏ సమస్య వచ్చినా వారే చూసుకుంటారు 
తమకు ఇచ్చిన ట్యాబ్‌ల్లో పలు ప్రశ్నలు ఉంటాయని భాస్కర్‌ వెల్లడించాడు. ఓటర్లను ప్రశ్నించి, సమాధానాలు రాబట్టాల్సి ఉంటుందని చెప్పాడు. మీరు టీవీ చూస్తారా? గ్రామంలో ఉన్న సమస్యలు, రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? సీఎం పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వంతో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతిపై మీ అభిప్రాయం? వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడా? రానున్న ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేస్తారు? లాంటి ప్రశ్నలు 18 వరకూ ఉన్నట్లు సర్వే బృందం సభ్యులు చెప్పారు. సర్కారుకి వ్యతిరేకంగా సమాధానాలు చెప్పేవారి ఓట్లను తొలగించాలంటూ తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు.

ఒక్కో బూత్‌ నుంచి 25 నుంచి 50 ఓట్లు.. ఒక్కో నియోజకవర్గంలో 10 వేల ఓట్లను తొలగించడమే తమకు అప్పజెప్పిన పని అని బృంద నాయకుడు భాస్కర్‌ చెప్పాడు. తమకు పైన తిరుమలేశ్వరరెడ్డి, శ్రీరామ్‌రెడ్డి అనే బాస్‌లు ఉన్నారని, తమకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే ఫోన్‌ద్వారా వారికి సమాచారం చేరవేస్తామని, అంతా వారే చూసుకుంటారని అన్నాడు. వారిద్దరితో అప్పటికప్పుడే ఫోన్‌లో మాట్లాడాడు. మీకు వచ్చిన భయం ఏం లేదు, మీరు ఇప్పుడు ఎంతమంది పట్టుబడ్డారు, ఏ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారో చెప్పండి, మీ లోకేషన్‌ ఆధారంగా మిమ్మల్ని వేరే ప్రాంతానికి తరలిస్తామంటూ అటునుంచి సమాధానం వచ్చింది. సర్వేల పేరిట ఓట్లను తొలగిస్తున్నారంటూ వైఎస్సార్‌ïïసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఆదేశాల మేరకు నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు