‘దీపం’పై క్రీనీడ

18 Aug, 2014 00:33 IST|Sakshi
‘దీపం’పై క్రీనీడ

‘గతంలో జరిగిందంతా బోగస్.. ఇప్పుడు జరిగేదే నిఖార్సు’ అంటూ పేదల పథకాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి లబ్ధిదారులను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటి వరకూ బోగస్ పేరుతో భారీగా తెల్ల రేషన్‌కార్డులు, పింఛన్ల ఏరివేతకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం ఇప్పుడు దీపం గ్యాస్ కనెక్షన్‌ల పైనా శకుని చూపు చూస్తోంది. కనెక్షన్‌ల సర్వేకు సమాయత్తం అవుతోంది.
 
 సాక్షి, రాజమండ్రి :గత ఏడాది మంజూరైన దీపం కనెక్షన్ల లబ్ధిదారులను ఇప్పటికే నిర్ణయించినా.. అదంతా రద్దుచేసి బోగస్ ఏరివేతకు అంటే చేపట్టే సర్వే పూర్తయిన తర్వాతే కొత్త జాబితా తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.జిల్లాలో దీపం పథకం 1999 నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. ఈ పథకం కింద మహిళలు సుమారు లక్షన్నర వరకూ గ్యాస్ కనెక్షన్లు అందుకున్నారు. కాగా గత మూడేళ్ల నుంచి పథకంలో కనెక్షన్ల మంజూరు తప్ప వాటి పంపిణీ ముందుకు సాగడం లేదు.
 
 గత ఏడాది జిల్లాకు సుమారు 40,000 కనెక్షన్లు మంజూరయ్యాయి. వీటిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియ వివిధ స్థాయిల్లో ఉంది. మండలాల వారీగా  లబ్ధిదారుల గుర్తింపు జరిగినా పలు చోట్ల నేటికీ అందించలేదు. తర్వాత రాష్ట్ర విభజన, వరుస ఎన్నికలు పథకాన్ని పక్కకు నెట్టేశాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది గనుక కనెక్షన్లు  అందుతాయని భావిస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం చేదు చవి చూపిస్తోంది. గతంలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ 2013లో జరిగిన కనెక్షన్ల మంజూరును నిలుపుచేయడంతో పాటు 2014లో కొత్త కనెక్షన్ల మంజూరును కూడా నిలుపు చేశారు.
 
 కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన కనెక్షన్లపై గురి!
 ఇప్పటి వరకూ ఈ పథకర  కింద కనెక్షన్‌లు మంజూరై, వినియోగిస్తున్న వారిని కూడా రీ సర్వే చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ హయాంలో మంజూరైన వాటిపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. వాస్తవంగా కనెక్షన్ మంజూరు చేశాక పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, ఆయిల్ కంపెనీల అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ పరిశీలన చేస్తుంది. లబ్ధిదారులకు గతంలో కనెక్షన్ ఉందో, లేదో ఆరా తీసిన తర్వాతే కనెక్షన్ మంజూరవుతుంది.
 
 కాగా ఈ లబ్ధిదారుల గుర్తింపులో స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు తమ ప్రాబల్యం చూపారనే ఆరోపణలతో ఏరివేత తలపెట్టారని తెలుస్తోంది. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారుల్లో ఈసారి తమ వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది కూడా టీడీపీ నేత ఉద్దేశమంటున్నారు. జిల్లాలో మూడేళ్లుగా దీపం కనెక్షన్లు మంజూరవుతున్నా పూర్తిగా లబ్ధిదారులకు అందించలేదు. 2011లో 13,426, 2012లో 21,296, 2013లో 40 వేల వరకూ కనెక్షన్లు మంజూరు చేయగా అరకొరగానే లబ్ధిదారులకు కేటాయించారు.
 

మరిన్ని వార్తలు