బొజ్జల తనయుడి ఆవేదన

4 Apr, 2017 08:29 IST|Sakshi
బొజ్జల తనయుడి ఆవేదన

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యం సరిగా లేదని మంత్రి పదవి నుంచి తొలగించడం బాగోలేదని మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తనయుడు సుధీర్‌ అన్నారు. ఒక్క మాట కూడా చెప్పకుండా మంత్రి పదవి నుంచి తొలగించడం బాధకరమన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ కుటుంబానికి మంత్రి పదవి కొత్తేమి కాదని, తన తాత దగ్గర నుంచి మంత్రులుగా వ్యవహరించారన్నారు. 35 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన వ్యక్తిని డీ గ్రేడ్‌ చేయడం ఆవేదన కలిగిస్తోందన్నారు.

మంత్రులందరి కంటే తన తండ్రి ఎక్కువగా తిరిగారని చెప్పారు. మంత్రిగా పనికిరానప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకని రాజీనామా చేశారన్నారు. తన తండ్రికి మద్దతుగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజక వర్గంలోని జెడ్పీటీసీ సభ్యుల నుంచి ఆలయ కమిటి చైర్మన్‌ల వరకు అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేశారని చెప్పారు. ఇదే విషయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్‌లకు వివరించామన్నారు.

ఇదంతా ప్రశాంత వాతావరణంలో జరిగితే, తన తల్లి వారిపై ఆగ్రహించినట్టుగా సోషల్‌ మీడియాలో రావడం బాధాకరమన్నారు. ఈ దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో నియోజకవర్గంలోని కార్యకర్తలతో తన తండ్రి సమావేశమవుతారని, తదుపరి కార్యచరణపై నిర్ణయం తీసుకుంటారని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు