సత్యవేడులో బాంబు కలకలం

16 Aug, 2019 09:34 IST|Sakshi
సత్యవేడులోని వీఎంకే కల్యాణ మండపం వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులు

సాక్షి, సత్యవేడు, చత్తూరు: స్వాతంత్య్ర దినోత్సవం తెల్లవారు జామున సత్యవేడులో బాంబు కలకలం సమాచారం స్థానిక పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. పోలీసుల కథనం.. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు గురువారం తెల్లవారు జామున 3 గంటలకు రాష్ట్ర పోలీస్‌ అత్యవసర సేవ అయిన 100కు ఫోన్‌ చేసి సత్యవేడులోని వీఎంకే కల్యాణ మండపంలో బాంబు బ్లాస్ట్‌ చేయనున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీనిపై స్పందించిన తమిళనాడు రాష్ట్ర డీజీపీ, ఏపీ ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన చిత్తూరు జిల్లా ఎస్పీ వెంటనే పుత్తూరు డీఎస్పీ మురళీకృష్ణ, సత్యవేడు సీఐ బీవీ శ్రీనివాసులుకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. డాగ్‌ స్క్వాడ్, బాంబ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.

హుటాహుటిన వీరందరూ కలసి సత్యవేడులోని వీఎంకే కల్యాణ మండపాన్ని తెల్లవారుజామున పరిశీలించారు. అక్కడ ఆ సమయానికి వివాహం జరుగుతుండగా వారిని వెలుపలికి పంపి మండపం పరిసరాలను అణువణువునా తనిఖీ చేశారు. అనంతరం అక్కడ వివాహ కార్య క్రమానికి వచ్చిన వారిని విచారణ చేశారు. అక్కడ ఎలాంటి బాంబులు అమర్చినట్లు ఆధారాలు లభ్యం కాకపోవడం, ఎలాంటి దుస్సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సత్యవేడు సీఐ బీవీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టించేందుకు తమిళనాడు 100కు ఎవరో ఆగంతకుడు ఫోన్‌ చేసినట్లు వెల్లడించారు. ఫోన్‌ చేసిన నెంబరు ఆధారంగా కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తనిఖీలలో సత్యవేడు ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు