‘విశాఖ’కు బాంబు బెదిరింపు

22 Oct, 2018 13:02 IST|Sakshi
నిందితుడు దిలీప్‌కుమార్‌ను ప్రశ్నిస్తున్న డీఎస్పీ భరత్‌ మాతాజీ

మద్యం మత్తులో గొడవ పడ్డ యువకులు

ఆ క్రమంలో బాంబు పెట్టారంటూ కేకలు బెంబేలెత్తిన ప్రయాణికులు

రాజమహేంద్రవరంలో గంటపాటు నిలిచిన రైలు

తనిఖీల అనంతరం ఏమీ లేదని తేల్చిన పోలీసులు

వారి అదుపులో ఓ యువకుడు, మరికొందరి పరారీ

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: భువనేశ్వర్‌ – సికింద్రాబాద్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టారంటూ బెదిరింపు కాల్‌ రావడంతో రాజమహేంద్రవరంలో రైల్వే అధికారులు బెంబేలెత్తారు. పోలీసుల కథనం ప్రకారం, భువనేశ్వర్‌లో ఎస్‌–6 బోగీలో కొందరు యువకులు ఎక్కారు. వీరిలో దిలీప్‌కుమార్‌ అనే యువకుడు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నాడు. బోగీ లోపల ఖాళీ లేకపోవడంతో వీరు గేటువద్ద కూర్చున్నారు. అప్పటికే మద్యం తాగి ఉన్నవారి మధ్య విశాఖలో వివాదం మొదలైంది. సామర్లకోట చేరువలో దిలీప్‌కుమార్‌కు, మిగిలిన యువకులకు మధ్య ఘర్షణ ముదిరింది. రైలు నడుస్తుండగానే పరస్పరం నెత్తురు వచ్చేలా దాడులు చేసుకున్నారు. ఆ సందర్భంగా ఒక వర్గం యువకులు బాంబులు పెట్టి  రైలును పేల్చివేస్తామంటూ బెదిరించారు. దీంతో బెంబేలెత్తిన ప్రయాణికులు కొందరు రైల్వే పోలీస్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు.

ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న దిలీప్‌కుమార్‌ చైన్‌ లాగి, రైలును నిలిపివేశాడు. దీంతో ఘర్షణ పడ్డ వారిలో కొందరు యువకులు రైలు దిగి పరారయ్యారు. వారు బాంబులు పెట్టారని దిలీప్‌కుమార్‌ అనడంతో బోగీలోని ప్రయాణికులు మరింత భీతిల్లారు. సమాచారం అందుకున్న సామర్లకోట రైల్వే పోలీసులు వెంటనే రైలును తనిఖీ చేసి,  రాజమహేంద్రవరం తీసుకువచ్చారు. రాత్రి 8.20 గంటలకు రాజమహేంద్రవరం వచ్చిన ఆ రైలును రైల్వే స్టేషన్‌లో గంటపాటు నిలిపివేశారు. రాజమహేంద్రవరం మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ భరత్‌ మాతాజీ ఆధ్వర్యాన టూ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ముక్తేశ్వరరావు, రైల్వే ఏఎస్పీ నగేష్‌ నోయల్, ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ రమణయ్యలు బోగీ మొత్తం డాగ్, బాంబు స్క్వాడ్‌లతో తనిఖీలు చేశారు. బాంబు లేదని నిర్ధారణ అయిన అనంతరం రైలును వదిలారు. ఘర్షణకు దిగిన యువకుల్లో దిలీప్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న అతడు పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని డీఎస్పీ భరత్‌ మాతాజీ తెలిపారు. నిందితులపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు