బాంబు కలకలం

4 Mar, 2019 08:20 IST|Sakshi
ప్రమాదకరమని వస్తువుపై రాసి ఉన్న దృశ్యం బాంబు స్క్వాడ్‌

సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన  అనుమానాస్పద వస్తువు

మెరైన్, సివిల్‌ పోలీసుల రంగప్రవేశం

వస్తువును పరిశీలించిన బాంబుస్క్వాడ్‌

ప్రమాదకరం కాదని తేల్చడంతో     ఊపిరిపీల్చుకున్న

మత్స్యకారులు, పోలీసులు

శ్రీకాకుళం, రణస్థలం: మండలంలోని జీరుపాలెం సముద్రం తీరంలోనికి అనుమానాస్పద వస్తువు అదివారం కొట్టుకురావడంతో మత్స్యకార గ్రామాల్లో కలకలం రేగింది. మధ్యాహ్న 2 గంటల సమయంలో కొందరు మత్స్యకారులు ఆ వస్తువును గుర్తించి ఒడ్డుకు చేర్చారు. ఆ వస్తువు బాంబులా ఉందని ఆనోటా, ఈనోటా మత్స్యకార గ్రామాల్లో వ్యాపించింది. జీరుపాలెం గ్రామస్తులు కొందరు మెరైన్, స్థానిక జె.ఆర్‌.పురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెరైన్‌ సీఐ అంబేడ్కర్, జె.ఆర్‌.పురం ఎస్‌ఐ బి.ఆశోక్‌బాబు వచ్చి ఆ వస్తువును పరిశీలించారు. ఆ వస్తువు పైన ‘సీఓటూ గ్యాస్‌ మండే పదార్థం జాగ్రత్త’ అని హెచ్చరిక సింబల్‌ సూచిస్తూ రాసి ఉండడంతో వారు జిల్లా బాంబు స్క్వాడ్‌ అధికారులకు సమాచారం అందించారు. వారు రాత్రి 7 గంటల సమయంలో విచ్చేసి ఆ వస్తువును క్షుణ్నంగా పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌ను కూడా తీసుకువచ్చారు.

డాగ్‌ స్క్వాడ్‌ ఏమీ గుర్తించకపోవడం, బాంబును డిస్మెంట్‌లింగ్‌ చేసే మెషిన్‌ ద్వారా ప్రమాదకర సంకేతాలు రాకపోవడంతో బాంబు కాదని నిర్ధారించారు. ఈ విషయంపై జె.ఆర్‌.పురం ఎస్‌ఐ బి.ఆశోక్‌బాబుకు వివరణ కోరగా.. పెద్ద, పెద్ద బోట్లలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆ వస్తువు నుంచి సీఓటూ గ్యాస్‌ విడుదలై అగ్నిని అర్పుతుందన్నారు. ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో ఆందోళన చెందారని, భయపడాల్సిన ప్రమాదం ఏమీ లేదన్నారు. మత్స్యకారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ దర్యాప్తులో మెరైన్, జె.ఆర్‌.పురం పోలీసులు, బాంబు స్క్వాడ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు