బాంబు కలకలం

3 Mar, 2014 00:10 IST|Sakshi

చేగుంట/వెల్దుర్తి, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ నుంచి మన్మాడ్ బయలుదేరిన అజంతా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్టు ఆదివారం సాయంత్రం వచ్చిన ఫోన్‌కాల్ కలకలం రేపింది. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు వెల్దుర్తి మండలం స్టేషన్ మాసాయిపేలో రైలును నిలిపివేశారు. సుమారు నాలుగు గంటలపాటు తనిఖీలు చేపట్టగా ఎలాంటి బాంబు ఆచూకీ లభించకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాలు ఇలా...
 అజంతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉన్నట్టు ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే కంట్రోల్ బోర్డుకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు స్టేషన్ మాసాయిపేటలోని స్టేషన్‌లో రైలును ఆపేశారు. ఈ రైలులో 24 బోగీలుండగా 4,800 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, రామాయంపేట సీఐ గంగాధర్, చేగుంట ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిలు  రైల్వే స్టేషన్‌కు చేరుకుని ప్రయాణికులను కిందికి దించేశారు.

 ఆందోళనకు గురైన ప్రయాణికులు ఆతృతగా రైలు దిగి పరుగులు పెట్టారు. కొందరు ప్రయాణికులు సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారికి చేరుకుని బస్సుల్లో వెళ్లిపోయారు. సికింద్రాబాద్ నుంచి బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు సుమారు నాలుగు గంటలపాటు సోదాలు చేయగా బాంబు ఆచూకీ లభించకపోవడంతో  అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఆకతాయిల పనేనని అధికారులు భావిస్తున్నారు. కంట్రోల్ బోర్డుకు వచ్చిన ఫోన్‌కాల్ నంబరు వివరాలు తెలుసుకోగా హైదరాబాద్‌కు చెందిన వీరమణి పేరుతో సిమ్‌కార్డు ఉన్నట్టుగా గుర్తించినట్టు ఓ అధికారి తెలి పారు. నాలుగు గంటలపాటు రైలు నిలిచిపోవడంతో సుదూరం వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రైలు ముందుకు కదిలింది.

మరిన్ని వార్తలు