పాస్‌బుక్‌ల సవరణలో ఫెయిల్

4 Sep, 2014 00:23 IST|Sakshi
పాస్‌బుక్‌ల సవరణలో ఫెయిల్
  •     పట్టాదారు పాస్ పుస్తకాల్లో మార్పులకు తీవ్ర జాప్యం
  •      నెలలు తరబడి కొనసాగుతున్న రెవెన్యూ నిర్లక్ష్యం
  •      757 దరఖాస్తులలో ఇప్పటికి రెండింటికే మోక్షం
  • విశాఖ రూరల్ : పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పుల సవరణ ప్రక్రియ నత్తను మరిపిస్తోంది. దరఖాస్తులు చేసి నెలలు గడుస్తున్నా.. సవరణలకు నోచుకోక  పట్టాదారులు ఇబ్బందులు పడుతున్నారు. పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులను పౌర సేవల పత్రం ప్రకారం 15 రోజుల్లో సరిచేయాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా నెలల తరబడి  వేచి చూడాల్సి వస్తోంది.

    ఇందుకు సవరణకు నోచుకున్న గణాంకాలే నిదర్శనం. పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పుల కారణంగా భూ యజమానులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాస్‌పుస్తకాల్లో తప్పులను సరిదిద్దడంతో పాటు మార్పులు, చేర్పులకు ఏడాది క్రితం ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీని ద్వారా పాస్‌పుస్తకాల్లో సవరణలతో పాటు, పట్టా సబ్ డివిజన్, ఫసలీలో అనుభవదారుని పేరు మార్పునకు వెసులుబాటు కలిగింది.
     
    757 దరఖాస్తులు.. : పట్టాదారు పాస్‌పుస్తకాల్లో సవరణల కోసం ఇప్పటి వరకు 757 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 16 దరఖాస్తులను తిరస్కరించగా, కేవలం రెండింటిలో మాత్రమే సవరణలు చేయడం గమనార్హం. కొత్త సాఫ్ట్‌వేర్‌లో మూడు కేటగిరీలుగా ఈ ప్రక్రియను చేపడుతున్నారు. కొత్త పట్టాదారుపాస్‌పుస్తకాల మంజూరు, పాస్‌బుక్ రీ ప్లేస్‌మెంట్, డూప్లికేట్ పాస్‌బుక్ కింద ఈ సేవలను అందిస్తున్నారు. కొత్త పాస్‌పుస్తకాల కోసం 539 మంది దరఖాస్తు చేసుకోగా ఏడింటిని తిరస్కరించగా, ఒక పాస్‌బుక్ మాత్రమే మంజూరు చేశారు. పాస్‌బుక్ రీప్లేస్‌మెంట్‌కు 152 దరఖాస్తులు రాగా ఏడింటిని తిరస్కరించగా ఒక్క పాస్‌పుస్తకాన్ని కూడా ఇవ్వలేదు. డూప్లికేట్ పాస్‌పుస్తకం కోసం 55 మంది దరఖాస్తు చేయగా రెండింటిని తిరస్కరించారు. కేవలం ఒకరికి మాత్రమే డూప్లికేట్ పాస్‌బుక్ ఇచ్చారు.
     
    60 రోజుల్లోగా ఇవ్వాల్సి ఉండగా..


    పట్టాదారు పాస్‌పుస్తకంలో పట్టాదారుని పేరు గాని, అతని తండ్రి పేరు గాని, లేదా ఇతర వివరాలు తప్పుగా వస్తే మార్పు చేసుకోడానికి మీ-సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భూక్రయవిక్రయాల ద్వారా ఒకరి పేరున ఉన్న పాస్‌పుస్తకాన్ని మరొకరి పేరున మార్పు చేసుకొనే అవకాశాన్ని కల్పించారు.
         
    తప్పుల సవరణకు రూ.35, కొత్త పట్టాదారుపాస్ పుస్తకానికి రూ.135, డూప్లికేట్ పాస్‌పుస్తకానికి రూ.235, పాస్‌పుస్తకంలో  పేరు మార్పునకు రూ.135 మీ-సేవా కేంద్రాల్లో చెల్లించాలి.
         
    తప్పుల సవరణకు 15 రోజులు పడుతుంది. పేరు మార్చడానికి(మ్యుటేషన్) 60 రోజులు పడుతుంది. పట్టాదారుడు దరఖాస్తు అందిన వెంటనే రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలించి పట్టామార్పునకు సంబంధించిన నోటీసులు గ్రామ చావడిలో పెడతారు. అభ్యంతరాలు రానిపక్షంలో కొత్త వారి పేరుమీద పాస్‌పుస్తకం ఇవ్వాలి. కానీ నెలలు గడుస్తున్నా దరఖాస్తుదారులకు పరిష్కారం లభించడం లేదు.
         
    మ్యుటేషన్ తరువాత కొత్త పాస్‌పుస్తకం మంజూరుకు ప్రస్తుతం అవకాశం లేదు. సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందుల కారణంగా ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు చెబుతున్నారు. గతంలో సమ్మెలు, ఎన్నికల కారణంగా జాప్యం జరిగిందంటున్నారు. సవరణలకు అవకాశం ఉన్నా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందుల కారణంగా వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి.
     

మరిన్ని వార్తలు