వైఎస్‌ జగన్‌పై పుస్తకం ఆవిష్కరణ

5 Apr, 2019 16:33 IST|Sakshi
వైఎస్‌ జగన్‌తో సీనియర్‌ జర్నలిస్ట్‌ పూడిశ్రీహరి, పుస్తకాన్ని ముద్రించిన నారు మాధవరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి సోదరులు

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాజకీయ జీవితం, 14 నెలల పాటు ఆయన చేసిన ప్రజాసంకల్పయాత్ర విశేషాలతో సీనియర్‌ జర్నలిస్ట్‌ పూడి శ్రీహరి రాసిన ‘‘అడుగడుగునా అంతరంగం’’ పుస్తకాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. వైఎస్‌ జగన్‌ రాజకీయ జీవితంలో ముఖ్యమైన మైలురాళ్లు, అనూహ్య మలుపులను జర్నలిస్టు శ్రీహరి ఈపుస్తకంలో చర్చించారు. 14 నెలల పాటు 3వేల648 కిలోమీటర్లు కొనసాగిన ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జరిగిన సంఘటనలను రచయిత పొందుపరిచారు.

268 పేజీల ఈ పుస్తకంలో వైఎస్సార్‌ మరణం తర్వాత వైఎస్‌ జగన్‌ ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు, సొంత పార్టీ స్థాపన, తన కాళ్ల మీద తాను నిలబడ్డానికి చేసిన ప్రయత్నాలు, ఆ సమయంలో తాను ఆ నిర్ణయాలు తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులన్నింటినీ కూడా ఈ పుస్తకంలో విపులంగా చర్చించారు. దీనితో పాటు వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వం, రోజువారీ ఆయన దినచర్య తదితర విషయాలు పుస్తకంలో ప్రముఖంగా కనిపిస్తాయి. 2003లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం, 2013లో ఆయన తనయ వైఎస్‌ షర్మిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పాదయాత్ర గురించి పుస్తకంలో పరిచయం చేసిన శ్రీహరి, జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన పాదయాత్రను సవివరంగా వివరించారు. పాదయాత్ర సమయంలో జరిగిన దాదాపు అన్ని ముఖ్య రాజకీయ ఘట్టాలను, పరిణామాలను ఈ పుస్తకంలో పొందు పరిచారు.

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన పాదయాత్రకు ప్రత్యక్షసాక్షిగా ఉంటూ యాత్ర వివరాలన్నింటినీ అక్షరంలోకి మార్చారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రజలతో మమేకం అయిన తీరు, ఆయన ప్రసంగాల తీరు, దానికి వచ్చిన స్పందన, వివిధ వర్గాల నుంచి కష్టనష్టాలు తెలుసుకున్న తీరు మొదలైన అంశాలకు పుస్తకంలో చోటు లభించింది. పాదయాత్ర వేదికగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని వైఎస్‌ జగన్‌ నడిపిన తీరు, బీజేపీని వదిలి కాంగ్రెస్‌తో చేయి కలిపిన టీడీపీ, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ కోణాన్ని పుస్తకంలో పేర్కొన్నారు. సీనియర్‌ జర్నలిస్టు పూడి శ్రీహరి రాసిన ఈ పుస్తకాన్ని ఎన్‌ఎంఆర్‌ మీడియా కమ్యూనికేషన్స్‌ తరపున నారు మాధవ రెడ్డి, నారు మహేశ్వర్‌రెడ్డి ముద్రించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా