స్టాళ్లే ఆలయాలు.. పుస్తకాలే దేవుళ్లు

8 Jan, 2016 00:17 IST|Sakshi

స్టాల్ నంబరు 224
విజయవాడవాసులకు ఏటా

జనవరిలో రెండు పండుగలు వస్తాయి. ఒకటి సంక్రాంతి, మరోటి పుస్తకాల పండుగ. విజయవాడ పుస్తక ప్రదర్శనకు ఒక ప్రత్యేకత ఉంది.  మన దేశంలో ఒకప్పుడు కోల్‌కతాలో నిర్వహించే పుస్తక ప్రదర్శన అత్యంత ఆదరణ పొందేది. ప్రస్తుతం ఈ ఘనతను విజయవాడ దక్కించుకుంది. విద్యా పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు... ఒకటేమిటి .. అన్ని అంశాల పుస్తకాలను విజయవాడ వాస్తవ్యులు ప్రేమగా అక్కున చేర్చుకుంటున్నారు. తమ ఆత్మీయులను ఇళ్లకు తీసుకువెళ్తున్నామన్న భావన వారిలో కనిపిస్తోంది. పుస్తక దేవుళ్లు కొలువైన ఈ ఆలయానికి పాఠక భక్తులు భక్తిశ్రద్ధలతో వచ్చి తమ దైవాలను ఇంటికి తీసుకువెళ్తున్నారు.
 - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ
 
 
విశ్వస్ఫూర్తి  ఆధ్యాత్మిక రచనలు
విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఆధ్యాత్మిక సంస్థ ‘విశ్వస్ఫూర్తి ధ్యానజ్ఞాన మార్గం’ కూడా పుస్తక ప్రదర్శనలో స్టాల్           ఏర్పాటుచేసింది. మీడియా విధానం ద్వారా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న సంస్థ ఇది.  ఏటా పుస్తక ప్రదర్శనలో ఈ స్టాల్ తప్పనిసరిగా ఉంటోంది. ఇందులో శ్రీశ్రీశ్రీ గురువిశ్వస్ఫూర్తి రచనలు మాత్రమే అమ్మకానికి ఉంటాయి. మనోప్రస్థానం, స్ఫూర్తి సంక్షిప్తాలు, ప్రజా   రాజ్యం... వంటి అనేక పుస్తకాలు లభ్యమవుతున్నాయి. ప్రతి అంశాన్నీ సైంటిఫిక్‌గా తమ   పుస్తకాల ద్వారా వివరించారు. ‘మనసు అంటే...’ అనే అంశంపై గీసిన రేఖాచిత్రం  విజ్ఞానాత్మకంగా ఉంది.
 
ఆధ్యాత్మిక చింతన

ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రతి స్టాల్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. మనోవికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలు ఎంతో దోహదం చేస్తాయి.  భారతజాతి మహేతిహాసాలు రామాయణభారతాలు. ఇవి ఇంటింటా ఉండాల్సిన, ప్రతి ఒక్కరూ చదవాల్సిన గ్రంథాలు. సహజకవి బమ్మెర  పోతనామాత్యుడు రచించిన శ్రీమద్భాగవతం కూడా ప్రతి ఇంట్లోనూ తప్పక ఉండాల్సిన

గ్రంథం. ఈ గ్రంథంలోని...
పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట  పలికెద వేరొండుగాథ పలుకగనేల...
 పద్యాన్ని ప్రతి తెలుగువారు నేర్చుకుని తీరాలి. మొత్తం భాగవత గ్రంథం చదవలేని వారికోసం, కొన్ని పద్యాలను ఎంపిక చేసి తాత్పర్య సహితంగా లభిస్తున్న పుస్తకాన్నయినా తప్పక కొనితీరాలి. పుస్తక ప్రదర్శనలోని అన్ని స్టాల్స్‌లోనూ ఇటువంటి గ్రంథాలు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా పురిపండా అప్పలస్వామి రచనలు, శ్రీనివాస శిరోమణి రామాయణం, ఉషశ్రీ రామాయణభారతభాగవత పుస్తకాలతో కూడిన గిఫ్ట్ ప్యాక్, అష్టాదశ పురాణాల సెట్, చాగంటి కోటేశ్వరరావు రచనలు... ఇవేకాకుండా, స్త్రీలవ్రత కథలు, వేదాలకు సంబంధించిన భాష్యాలు, అనేకులు రచించిన సుందరకాండ వంటి పుస్తకాలతో బుక్ ఫెస్టివల్ ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. మరీ ముఖ్యంగా గొల్లపూడి వీరాస్వామి సన్స్-           రాజమండ్రి వారి స్టాల్‌లో కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలే పుష్కలంగా లభిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు