బోస్ ఆశలపై నీళ్లు

15 Mar, 2014 03:50 IST|Sakshi
  •      పలమనేరు అభ్యర్థిత్వంపై టీడీపీలో మారుతున్న సమీకరణలు
  •      తాజాగా తెరపైకి డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్ పేరు
  •      పరిశీలనలో మాజీ మంత్రి  అరుణ కుమారి పేరు
  •   సాక్షి, తిరుపతి : పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో కొత్త సమీకరణలు చోటుచేసుకుంటున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వైశ్య సామాజిక వర్గానికి చెందిన సుభాష్‌చంద్రబోస్ పేరు దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో తాజాగా కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ప్రధానంగా చిత్తూరు మాజీ ఎంపీ డీకే.ఆదికేశవులునాయుడు కుమారుడు డీఏ.శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

    ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన మాజీ మంత్రి టీజీ.వెంకటేష్‌కు కర్నూలు అసెంబ్లీ టికెట్టు ఖరారైంది. ఈయన కూడా వైశ్య సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో రాయలసీమలోనే వైశ్య సామాజికవర్గం నుంచి ఇద్దరికి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేనందున పలమనేరు నుంచి వేరే సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇం దులో భాగంగా సుభాష్‌చంద్రబోస్ అభ్యర్థిత్వంపై నీలి నీడలు కమ్ముకున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  
     
    కాగా అధిష్టానం నుంచి బోస్‌కు కచ్చితమైన హామీ రావడంతో ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు రావడంతో బోస్ కుటుంబానికి పలమనేరు మున్సిపల్ చైర్మన్ పదవిని ఇస్తామని జిల్లా ముఖ్యనేతల నుంచి సంకేతాలు పంపా రు.

    బోస్ మాత్రం ఆసక్తి చూపలేదు. మున్సిపల్ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ దాఖలుకు శుక్రవారంతో గడువు ముగిసింది. అయితే ఆయన కుటుంబం నుంచి మహిళలు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో జిల్లా పార్టీ చేసిన సూచనల పట్ల బోస్ సుముఖంగా లేరనేది స్పష్టమవుతోంది.

    మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే అసెంబ్లీ టికెట్టు డుమ్మా కొడతారనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. పలమనేరు నుంచి డీఏ.శ్రీనివాస్‌ను బరిలోకి తెచ్చేందుకు కూడా ముమ్మరంగా రాయబారాలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గానికి సంబంధించి సుమారు 25 వేల ఓట్లు ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో ఆ సామాజికవర్గానికి టికెట్టు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.

    అదేవిధంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. చంద్రగిరి నుంచి ఆమెకు టికెట్టు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నప్పటికీ టీడీపీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏ కారణం చేతనైనా ఆమెను అక్కడి నుంచి పోటీ చేయించలేని పరిస్థితి వస్తే పలమనేరు ఖాయంగా చెబుతున్నారు. మొత్తానికి తాజాగా జరుగుతున్న పరిణామాలు బోస్ ఆశలపై నీళ్లు చల్లేవిగా ఉన్నాయి. కుల సమీకరణ ల్లో చివరి నిమిషం వరకు పలమనేరు టీడీపీ టికెట్టుపై ఉత్కంఠ కొనసాగేలా ఉంది.
     

మరిన్ని వార్తలు