అర్హులందరికీ సంక్షేమ పథకాలు

16 Aug, 2019 11:03 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి బొత్స.. చిత్రంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ 

పథకాల అమలులో వలంటీర్ల బాధ్యత కీలకం   

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స          

వార్డు వలంటీర్లకు నియామక పత్రాలు

సాక్షి, కర్నూలు: టీడీపీ ఐదేళ్ల పాలనలో పక్కదారి పట్టిన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని మున్సిపల్‌శాఖా మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇందులో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అమలు చేసేందుకు వలంటీర్ల వ్యవస్థను తెచ్చినట్లు తెలిపారు. పథకాల అమలు విషయంలో వలంటీర్ల బాధ్యత కీలకమన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని వలంటీర్లకు పిలుపునిచ్చారు. నగర శివారులోని ఎస్‌ఎల్‌ఎన్‌ గార్డెన్‌లో గురువారం నగరపాలక స్పెషల్‌ ఆఫీసర్, జిల్లా కలెక్టర్‌  వీరపాండియన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వార్డు వలంటీర్ల వ్యవస్థను మంత్రి ప్రారంభించారు.

వార్డు వాలంటీర్ల కరదీపికను మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు ఆవిష్కరించారు. వలంటీర్లుగా ఎంపికైన వారికి నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన రెండున్నర నెలల్లోనే ఆచరణలో పెట్టారన్నారు. పెద్ద ఎత్తున అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను అర్హులందరికీ పార్టీలు, కులాలకు అతీతంగా వలంటీర్లు ఇంటి వద్దకే లబ్ధి చేకూరుస్తారన్నారు. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ అధికారం చేపట్టిన రెండున్నర నెలల్లోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 4 లక్షల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.

పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకే ఇచ్చేలా చట్టం తెచ్చిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే సాధ్యమైందన్నారు.  జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వార్డు వాలంటీర్‌ వ్యవస్థ గురువారం నుంచి ప్రారంభమైందని తెలిపారు. జిల్లాకు సంబంధించి 9 మున్సిపాల్టీల్లో 5,390 మంది వార్డు వలంటీర్లకు గాను 5,156 మంది ఎంపికయ్యారన్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ ప్రభుత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వలంటీర్లకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కమిటీల మాదిరి కాకుండా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అర్హులందరికీ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ మాట్లాడారు. మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు, మెప్మా పీడీ నాగరాజు నాయుడు, అడిషనల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు