‘రివర్స్‌ టెండరింగ్‌లో మరో రూ. 30.91 కోట్లు ఆదా’

29 Jan, 2020 12:59 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో టిడ్కోలో(టౌన్ షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ) సత్ఫలితాలు సాధించామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంత్రి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ కార్యక్రమాల నిమిత్తం టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రకియలో తాజాగా మరో రూ. 30.91 కోట్లు ఆదా చేసినట్లు తెలిపారు. విశాఖ పట్టణం, శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదించిన 5088 యూనిట్ల నిర్మాణాలకు రూ.306.61 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించగా, డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ రూ.275.7 కోట్లకు ఈ పనులను చేపట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ బిడ్ దాఖలు చేసి ఎల్ 1 గా నిలిచిందని తెలిపారు. (రూ.103.89 కోట్లు ఆదా)

ఈ ప్యాకేజిలో రూ.30.91 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గి.. ప్రజా ధనాన్ని ఆదా చేశామని తెలిపారు. ఇంతవరకు మొత్తం 12 విడతల్లో 63,744 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.3,239.39 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించగా, రూ.2,847.16 కోట్లతో ఆ పనులను చేపట్టడానికి వివిధ సంస్థలు ముందుకు వచ్చాయని మంత్రి వివరించారు. ఇలా 12 ప్యాకేజిల్లో మొత్తం రూ. 392.23 కోట్ల మేర ప్రజా ధనం ఆదా అయ్యిందని ఆయన వివరించారు. వివిధ ప్యాకేజిల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ. 156  నుంచి రూ.316 వరకు ఖర్చు తగ్గి, ప్రభుత్వంపై భారం తగ్గిందని ఆయన తెలిపారు.

చదవండి : ‘రివర్స్‌’తో మొత్తం రూ.1,532.59కోట్లు ఆదా

‘రివర్స్‌ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా చేస్తున్నాం’

మరిన్ని వార్తలు