ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు: బొత్స

8 Oct, 2013 14:09 IST|Sakshi
ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు: బొత్స

హైదరాబాద్‌: ఉద్యోగులంతా సమ్మె విరమించాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సీఎంతో రేపు జరిగే చర్చల్లో ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుంటామని, ఆమేరకు హామీలు నిలబెట్టుకునేలా బాధ్యత తీసుకుంటామని చెప్పారు. తెలంగాణపై అఖిలపక్షం కోసం కేంద్రానికి లేఖరాస్తానని చెప్పారు. పార్టీల డిమాండ్లను తెలుసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నానని అన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయని ఆరోపించారు. విజయనగరంలో జరిగిన ఘటనలు దురదృష్టకరమన్నారు. పార్టీలతో మాట్లాడి కేంద్రం పరిష్కారం చూపాలన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటూ పార్టీ సాంప్రదాయంగా తాను అధిష్టానానికి చెప్పానని వెల్లడించారు. కాని దాన్ని చివరిమాటగా తీసుకోవద్దని తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. సాంప్రదాయం పాటించాం తప్ప తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరంలేదన్నారు.

రాష్ట్ర విభజనపై నిర్ణయం వల్ల కాంగ్రెస్‌ పార్టీ చులకనైపోయిందన్నారు. పార్టీ గురించి చవకగా ఆలోచించే పరిస్థితి వచ్చిందని వాపోయారు. తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామన్నారు. తెలుగు మట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటనిగతంలో తాను చెప్పిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కొందరు గట్టిగా మాట్లాడ్డంవల్ల విభజన ప్రక్రియ ఆగలేదన్నారు. కొంతమంది అజెండాలో సమైక్య రాష్ట్రమే లేదంటూ సీఎం కిరణ్‌పై బొత్స పరోక్ష విమర్శలు చేశారు.

మరిన్ని వార్తలు