ప్రభుత్వానికీ విచక్షణాధికారం

5 Feb, 2020 06:03 IST|Sakshi

సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకూ నిబంధనలుంటాయి  

అసెంబ్లీ కార్యదర్శిపై ఒత్తిడి తేవాల్సిన అవసరం మంత్రులకు లేదు 

మంత్రి బొత్స సత్యనారాయణ 

సాక్షి, అమరావతి: శాసన మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటే ప్రభుత్వానికి కూడా ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉంటాయని, వాటికి విరుద్ధంగా ఎలా చెబితే అలా అధికారులు చేయలేరని అన్నారు. అసెంబ్లీ సెక్రటరీపై ఒత్తిడి తేవాల్సిన అవసరం మంత్రులకు లేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే అసెంబ్లీ సెక్రటరీ వ్యవహరిస్తారని తెలిపారు. రూల్‌ ప్రకారం వెళ్లాలని అధికార పక్షం కోరితే, ప్రతిపక్షం మాత్రం రూల్‌కు విరుద్ధంగా వెళ్లాలని చెప్పడం మండలి చరిత్రలో చోటుచేసుకున్న ఆశ్చర్యకర పరిణామమని బొత్స అన్నారు.   

ఆ విషయం కేంద్రం ఎప్పుడో చెప్పింది 
రాజధాని  వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని కేంద్రం ఎప్పుడో చెప్పిందని బొత్స గుర్తు చేశారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం అమలు చేస్తామని చెప్పారు. అర్హులైన ఆయా వర్గాల పేద మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్‌ సర్కారు అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేసిందని తెలిపారు.   

చంద్రబాబు నిరూపించాలి  
రాష్ట్రంలో 7 లక్షల పెన్షన్లు తొలగించారని ఆరోపిస్తున్న చంద్రబాబు ఆ విషయం నిరూపించగలరా? అని బొత్స సవాల్‌ విసిరారు. ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబు మారడం లేదని ఎద్దేవా చేశారు. లబ్ధిదారులు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో మీడియా, సోషల్‌ మీడియా ద్వారా చూస్తున్నామని చెప్పారు. చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో కూడా పారదర్శకంగా పెన్షన్లు ఇచ్చామని గుర్తుచేశారు. 

మరిన్ని వార్తలు