పట్టణ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు

30 Mar, 2020 04:15 IST|Sakshi

మున్సిపల్‌ శాఖ అధికారులకు మంత్రి బొత్స ఆదేశం

కరోనా కట్టడికి విజయవాడలో కంట్రోల్‌ రూం

మురికివాడవాసుల అవసరాలపై ప్రత్యేక దృష్టి  

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పట్టణ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మురికివాడల్లో ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్లతో ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి బొత్స మాట్లాడుతూ పట్టణాల్లో మొబైల్‌ మార్కెట్లను అందుబాటులోకి తేవాలని చెప్పారు. కరోనా కట్టడిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేయాల న్నారు.

క్వారంటైన్‌ సెంటర్ల నిర్వహణ, మార్కెట్‌ ప్రాంతాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ, ఆ ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించడం, ధరల పట్టికలు ప్రదర్శించడం, వలస కూలీల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. హాస్టళ్లు, మెస్‌లలో ఉన్న వారికి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పారు. కరోనా వైరస్‌ కట్టడికి విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యా లయంలో రాష్ట్రస్థాయి కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇంటింటి సర్వేలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. అందుకోసం సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించ నున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, రాష్ట్ర కమిషనర్‌–డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు