రాష్ట్ర సమగ్రాభివృద్ధే మా లక్ష్యం

21 Jan, 2020 06:47 IST|Sakshi

అందుకే అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ: మంత్రి బొత్స 

గతంలో ప్రాంతీయ అసమానతల వల్లే రాష్ట్ర విభజన 

రాజధాని పేరిట చంద్రబాబు చేసింది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం 

ఆయన విధానాల వల్లే ప్రాంతీయ వైషమ్యాలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 13 జిల్లాలు, ఐదు కోట్ల మంది ప్రజల సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా సమానాభివృద్ధి సాధించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏఎంఆర్‌డీఏ) ఏర్పాటు బిల్లును సోమవారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రాంతీయ అసమానతల వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బొత్స చెప్పారు.

నాడు చంద్రబాబు లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా అభివృద్ధిని అంతా ఒకే చోట కేంద్రీకరిస్తూ సీఆర్‌డీఏ చట్టాన్ని రూపొందించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులను కూడా గత ప్రభుత్వం బేఖాతర్‌ చేసిందన్నారు. దీంతో తాము అన్యాయానికి, వివక్షకు గురి అవుతున్నామని ఇతర ప్రాంతాల ప్రజల్లో అసంతృప్తి రగులుతోందని చెప్పారు. దీన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కార్యాచరణ చేపట్టారన్నారు. మంత్రి బొత్స ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.... 

విశాఖ వద్దని మీ ఎమ్మెల్యేలు చెప్పగలరా?
- గతంలో ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీల సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నాం.  
- జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికలను హైపవర్‌ కమిటీ పరిశీలించి తుది నివేదికను సమర్పించింది.  
అన్ని అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించిన అనంతరం పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి వికేంద్రీకరణ కూడా సాధ్యమవుతుందని ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చింది.  
- రాయలసీమ ప్రజలు సాగునీరు, తాగునీరు కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్ర వాసులు తమ ప్రాంత అభివృద్ధి కోసం గళమెత్తుతున్నారు. వారందరి మనోభావాలను గుర్తించే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంది 
- అభివృద్ధి అంటే ఏ ఒక్క ప్రాంతానికో, సామాజిక వర్గానికో పరిమితం చేయడం కాదు.  
- అభివృద్ధి ఫలాలను 13 జిల్లాలకూ సమానంగా అందించేలా పరిపాలన వికేంద్రీకరణ విధానాన్ని ముఖ్యమంత్రి రూపొందించారు.  
- వైజాగ్‌ రాజధాని కావాలని ఎవరడిగారని చంద్రబాబు పదేపదే అంటున్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఉండాలని ఉత్తరాంధ్రవాసులుగా మేం అడుగుతున్నాం. కచ్చితంగా అడుగుతాం. మా ప్రాంత మనోభావాలను వెల్లడిస్తాం.  
- విశాఖ రాజధానిగా వద్దని అక్కడ నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పగలరా? 
చంద్రబాబు మాదిరిగా మేం రాజధాని పేరిట రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయం.  

మరిన్ని వార్తలు