టీడీపీ నాలుగేళ్లలో చేసింది శూన్యం : బొత్స

30 Aug, 2018 14:51 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ 

మహానేత వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన బొత్స

జగన్‌ సీఎం అయితే పేదల కష్టాలు తొలుగుతాయి : మజ్జి

అభివృద్ధి కావాలంటే జగన్‌ సీఎం కావాలి : బెల్లాన  

మెరకముడిదాం: తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలనలో జిల్లాలోగాని, చీపురుపల్లి నియోజకవర్గంలోగాని జరిగిన అభివృద్ధి శూన్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. మెరకముడిదాంలో రూ.3లక్షలతో నిర్మించిన తొమ్మిది అడుగుల దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆయన బుధవారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలనలో ఆ పార్టీ గ్రామ స్థాయి నేతల నుంచి అందరూ దోచుకో...దాచుకో...విధానమే పాటిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు కూడా టీడీపీ నాయకులు డబ్బులు వసూలు చేయడం దారుణమని దుయ్యబట్టారు.

గతంలో తాను మంత్రిగా ఉన్న కాలంలో ఒక్క మెరకముడిదాం గ్రామంలోనే 850 ఇళ్లను పేదలకు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీ నేతలు కనీసం అందులో పది శాతం ఇళ్లు 85 కూడా మంజూరు చేయలేదని చెప్పారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేస్తూ...పేదల అభివృద్ధికే పాటుపడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో దీవించాలని కోరారు. జిల్లాలో ఓ వైపు డెంగీ జ్వరాలు బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే జిల్లా మంత్రికిగాని, ఎమ్మెల్యేలకుగాని పట్టడం లేదని, అధికారులు ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించడం బాధాకరమన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలను కూడా నిర్వహించలేని అసమర్ధ పాలన కొనసాగుతుందన్నారు.

జిల్లా పార్టీ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహానేత విగ్రహాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జనం మదిలో ఉన్న ఏకైక నాయకుడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరేనన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అందించిన మహావ్యక్తి అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణను, రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందన్నారు. టీడీపీ నాయకులు సంక్షేమ పథకాలు తమ ఇష్టానుసారం పంచుకుంటున్నారని ఆరోపించారు.

కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎస్‌వీ రమణరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల విశ్వేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు తాడ్డి కృష్ణారావు, తాడ్డి వేణుగోపాలరావు, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్‌ కె.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్, గరివిడి మండల పార్టీ నాయకులు పొన్నాడ వెంకటరమణ, మీసాల విశ్వేశ్వరరావు, గుర్ల మండల నాయకులు శీర అప్పలనాయుడు, వరదా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు