చంద్రబాబుకు మంత్రి బొత్స సూటి ప్రశ్న

18 Oct, 2019 18:49 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కరువైందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగేలా సీఎం జగన్‌ ఏదైనా కొత్త చట్టం తెచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. వ్యక్తి, ప్రభుత్వ గౌరవనికి భంగం  కలిగేల వాస్తవాలను వక్రీకరించి రాస్తే పరువు నష్టం దావా వేయడం సహజమే కదా అని స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘గతంలో కూడా నేను మంత్రిగా చేసిన సమయంలో కూడా అసత్య ప్రచారాలు, వక్రభాష్యాలు చెప్పిన పత్రికలపై చర్యలకు నిర్ణయించాం. 

అభాసుపాలు చేయాలని చూస్తే పరువు నష్టం దావా వేసేవాళ్లం. మీ హయాంలో ఇచ్చిన జీవోలు మర్చిపోయారా చంద్రబాబూ. సాక్షాత్తు మీడియాలోని వ్యక్తులపై కేసులు పెట్టమని జీవోలు ఇవ్వలేదా. ఇష్టానుసారంగా రాసుకోవచ్చని ఏ న్యాయస్థానమైనా తీర్పు ఇచ్చిందా. ఎవరిపైన అయినా ఇష్టమొచ్చినట్టు రాస్తే చూస్తూ కూర్చోవాలా. ఏ మీడియా జర్నలిస్టుని కూడా చంద్రబాబులా మీడియా సమావేశాలకు రావొద్దని మేం ఎవరినైనా నియంత్రించామా. పత్రికల్లో ప్రకటనల అంశంపై మాట్లాడే చంద్రబాబు..  ఆయన హయాంలో కొన్ని పత్రికలకే ఎందుకు  ప్రకటనలు ఇచ్చారు. వీటన్నిటికీ చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలి’ అని మంత్రి అన్నారు.

మరిన్ని వార్తలు