పోలవరం జాతీయ కుంభకోణం: బొత్స

21 Sep, 2017 01:09 IST|Sakshi
పోలవరం జాతీయ కుంభకోణం: బొత్స

సాక్షి, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌ సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబు ధనదాహం వల్లే పోలవరం ఆలస్యమవుతోందని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. చంద్రబాబు తన ఆర్థిక అవసరాల కోసం, అవినీతి కార్యక్రమాల కోసం జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేయడం ద్వారా ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టారని ధ్వజమెత్తారు. పోలవరం రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి బాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. పోలవరం దోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని చెప్పినా వినకుండా బాబు కంపెనీ ప్రతినిధులను వెనకేసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల తర్వాత ఆ కంపెనీ వల్లే పోలవరం ఆలస్యం అయిందని బాబు సాకులు వెతకడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమయంలో మీకు నోట్ల సంచులు మోసిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చింది వాస్తవం కాదా..? అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కాంట్రాక్టర్ తప్పు చేశాడని మూడేళ్ల తర్వాత చెబుతారా..? కేంద్ర సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు, అధికారులు అడుగుతున్నప్పుడు ఆ కంపెనీని ఎందుకు వెనకేసుకొచ్చారో సమాధానం చెప్పాలన్నారు.  వైఎస్‌ఆర్ హయాంలో రూ. 16వేల కోట్ల అంచనాతో పోలవరానికి శంకుస్థాపన చేసి రూ. 4వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారని, 80శాతం కాలువలు కూడా పూర్తయ్యాయి. భూసేకరణ కోసం పరిహారం కూడా ఇస్తే చంద్రబాబు జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని మాట్లాడారని గుర్తు చేశారు.

చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలవరం అంచనాలను రూ. 16వేల కోట్ల నుంచి 48వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. పోలవరం అంచనాలు రూ.300 కోట్లు ఎలా పెరిగాయో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజాధనాన్ని వ్యయంగా పెంచి దోచుకుంటుంది వాస్తవం కాదా అని నిలదీశారు. రైతులను ఆదుకునే,  ప్రజల దాహార్తిని తీర్చే పోలవరం ప్రాజెక్టును మీ స్వార్థం కోసం వాడుకోవడం ఎంతవరకు సమంజసమని బాబును ప్రశ్నించారు. మూడున్నరేళ్లలో పోలవరంకు చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.