వేరుశనగకు మద్దతు

19 Nov, 2019 08:34 IST|Sakshi
మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, చిత్రంలో మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి  

తొందరపడి రైతులు పంటను అమ్ముకోవద్దు

రిజర్వేషన్లపై సీఎం జగన్‌ నిర్ణయం చారిత్రాత్మకం 

సామాన్యునికి  సైతం ఇసుక అందేలా చూస్తాం 

జిల్లాలో 16 మార్కెట్‌ కమిటీల ఏర్పాటు 

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ  

సాక్షి, అనంతపురం: ‘అనంత’ రైతుకు మేలు జరిగేలా వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బొత్ససత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిలాల్లో అత్యధిక మంది రైతులు వేరుశనగ పంట సాగు చేశారని, ప్రస్తుతం మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు క్వింటాకు రూ.5,090 ప్రకారం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా వేరుశనగ రూ.4 వేలకు మించి కొనుగోలు చేయడం లేదని, రైతులెవరూ తొందరపడి పంటను దళారులకు విక్రయించవద్దని కోరారు. 

రిజర్వేషన్లు దేశంలోనే ఓ చరిత్ర 
ప్రజాసంకల్ప పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ప్రత్యేకించి మహిళలకు నామినేటెడ్‌ పోస్టులో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారని, దేశంలోనే ఇదో చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ఈ క్రమంలో మార్కెట్‌యార్డు కమిటీలు, దేవాలయాల పాలకవర్గాల్లోనూ రిజర్వేషన్‌ అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. 

జిల్లాలో 16 మార్కెట్‌ కమిటీలు 
జిల్లాలో 16 మార్కెట్‌యార్డులు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని కమిటీలకు లాటరీ పద్ధతిలో రిజర్వేషన్‌ అమలు చేసినట్లు వివరించారు. ప్రతి నియోజకవర్గానికి ఓ మార్కెట్‌యార్డు ఏర్పాటు చేస్తుండగా.. గుంతకల్లు, కదిరిలో మాత్రం రెండేసి చొప్పున మార్కెట్‌యార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.  

ఇసుక కొరత తీరుస్తాం 
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయని, త్వరలోనే ఇసుక కొరత సమస్యను పరిష్కారమవుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ధరలు ఖరారు చేసినట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. సామాన్యునికి సైతం ఇసుక అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.  

అబాసుపాలు కావడం ఆ పార్టీకి పరిపాటిగా మారింది 
రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అమల్లోకి వచ్చిన రోజు నుంచి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. సచివాలయాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1.40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే... అన్నీ ఆ పార్టీ వారికే, ఆ మతం వారికే అని టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారన్నారు. తర్వాత రైతులకు రూ. 13,500 రైతు భరోసా ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నించారన్నారు. తాజాగా డ్వాక్రా మహిళలను ఒక లీడర్లు, నాయకురాళ్లుగా తయారు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పిస్తుంటే దాన్ని కూడా విమర్శిస్తున్నారన్నారు.

తొలుత విమర్శించడం ప్రజలు స్వాగతించాక అబాసుపాలు కావడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ఎమ్మెల్యేలు అనంతవెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి, పీవీ సిద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, డాక్టర్‌ తిప్పేస్వామి, ఎమ్మెల్సీలు వెన్నపూసగోపాల్‌రెడ్డి, మహ్మద్‌ఇక్బాల్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ సీఈఓ  ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంత్రి బొత్స జిల్లా నాయకులతో కలిసి మార్కెట్‌ కమిటీలు, రిజర్వేషన్లు, ఇసుక, ఇతరాత్ర సమస్యలపై చర్చించారు.   

దోపిడీ విధానాలకు మేం వ్యతిరేకం 
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అవలంభించిన లోపబూయిష్టమైన, దోపిడి విధానాలకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి బొత్స తెలిపారు. టీడీపీ హయాంలో దోపిడీ ఎక్కువైనందుకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి తగిన బుద్ధి చెప్పారన్నారు. మేము కూడా అవే వి«ధానాలు అమలు చేయాలని ప్రతిపక్ష నేత డిమాండ్‌ చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. రాజధాని విషయంలో సింగపూర్‌ కంపెనీనే స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిందనీ, అయితే ఈ ప్రభుత్వంతో భవిష్యత్‌లో కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నామని, గతంలో కన్నా మిన్నగా పెట్టుబడులు పెడతామని వెల్లడించిందని మంత్రి వివరించారు. స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో సింగపూర్‌ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకోవడం లోపబూయిష్టమని న్యాయస్థానాలు కూడా చెప్పాయన్నారు. 

మరిన్ని వార్తలు