అవినీతి కూపంలా రాజధాని ప్రాంతం..

26 Jun, 2019 19:23 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతం మొత్తం అవినీతి కూపంలా ఉందని, అమరావతిలో ఏది ముట్టుకున్నా అవినీతే కనిపిస్తోందని ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సీఆర్‌డీఏపై బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న బొత్స.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి వ్యవహారంలో గత టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని అవినీతి కూపంలా ఉందని, ఈ నేపథ్యంలో రాజధాని వ్యవహారాలను  మరింత లోతుగా పరిశీలించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని ఆయన వెల్లడించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా ప్రభుత్వం వారికి చేసిన ప్లాట్ల కేటాయింపుల్లోనూ అవకతవకలు జరిగాయని ఆయన తెలిపారు. 

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తమ ప్రభుత్వం ఎంతమాత్రం కొనసాగించదని ఆయన తేల్చి చెప్పారు. అందుకే టీడీపీ హయాంలో చేపట్టిన ప్రతీ కార్యక్రమంపైన లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ఇటీవలే ఏర్పడినందున.. తొలుత అవినీతి కూపం నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దాని తరువాత అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామన్నారు. రాజధాని వ్యవహారంపై అధికారులతో త్వరలో మరోసారి సమావేశం నిర్ణయిస్తామని.. ఆ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రాజధాని ప్రాంతంలోని గత సీఎం చంద్రబాబు నివాసానికి సమీపంలోని నిర్మించిన ప్రజావేదిక తొలగింపుతో.. అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు