బొత్స సప్లయర్‌గా పని చేశారా?: కొండా సురేఖ

19 Jul, 2013 20:18 IST|Sakshi
బొత్స సప్లయర్‌గా పని చేశారా?: కొండా సురేఖ

వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో చూసిన కష్టాలకు స్పందించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గానికి మేలుచేసే నిర్ణయాలు తీసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఫీజు పోరు దీక్షలో ఆమె మాట్లాడారు. ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతున్న ప్రభుత్వం వారిని ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తీసుకెళ్తోందని విమర్శించారు. సమస్యల్లో విలవిలాడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతోందన్నారు. విద్యార్థుల చదువులు గాలిలో దీపంలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్పై బొత్స చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తూ... '3000 కిలోమీటర్ల యాత్ర పూర్తిచేసిన షర్మిలపై ఆరోపణలు చేసేవారికి బుద్ధి ఉండాలి. షర్మిల పాదయాత్ర కు జిల్లాలో వచ్చిన స్పందన చూసి నిద్ర పట్టకపోవడంవల్లే పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆరోపణలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న మద్యం షాపుల వల్ల ప్రజలు నష్టపోతున్నారని షర్మిల చెప్పినదానిపై అలాంటి ఆరోపణలు చేయవచ్చా? బ్రదర్ అనిల్‌కు చేసిన సహాయం గురించి ఆయన్నే అడగండని చెప్పే బదులు చేసిన సహాయం ఏంటో బొత్స ఎందుకు చెప్పట్లేదు? వైఎస్‌పై వ్యక్తిగత విమర్శలు చే యడం ద్వారా బొత్స తన స్థాయి ఏంటో నిరూపించుకుంటున్నారు.

తాగే అలవాటు మగవారికి ఉంటే వారు ఇంట్లో తాగుతారు. వైఎస్ అలా తాగి ఉంటే ఆ సమయంలో బొత్స అక్కడ ఎందుకు ఉన్నారు? 365 రోజులు తాగేవారు అని చెప్తున్న బొత్స అన్ని రోజులు వెంట ఉన్నారంటే అక్కడ సప్లయర్‌గా పనిచేసేవారా? బొత్స పనుల వల్ల ‘కేబినెట్‌లో అవినీతి మంత్రి’ అని వైఎస్ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం మరిచినట్లున్నారు. వైఎస్ మరణించిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలంటూ సంతకాల సేకరణ కోసం మంత్రుల క్వార్టర్‌లోని తన నివాసానికి పిలిచి బ్రేక్‌ఫాస్ట్ పెట్టి మరీ బొత్స అప్పుడు మంత్రులుగా ఉన్న మాకు చెప్పలేదా? ఇవన్నీ మరిచి బొత్స విమర్శలు చేయడం వింతగా ఉంది' అని కొండా సురేఖ అన్నారు.

మరిన్ని వార్తలు