వారం రోజుల తర్వాత ప్రజలు గుర్తుకు వచ్చారా?

20 Aug, 2019 13:03 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం :  గోదావరి, కృష్ణా వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పని చేయడంతో ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా నివారించగలిగామని మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వరద నిర్వహణలో ప్రభుత్వం చాలా వేగంగా పని చేసిందని బాధిత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వరద నిర్వహణకు సంబంధించి విశాఖలో ఆయన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. అయితే వరదల నష్ట నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నాయకులు మాత్రమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకుంటే గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయేవన్నారు. వరదలు వచ్చిన వారం రోజుల తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చారా? అని బొత్స ప్రశ్నించారు. ఎటువంటి దోపిడీ, అనవసరపు పబ్లిసిటీ లేకుండా వరద బాధితులని ప్రభుత్వం ఆదుకుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోతే మంత్రులు ఆ ప్రాంతంలో వెంటనే పర్యటించారనే ఉక్రోషంతో టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారన్నారు. దేవినేని ఉమ ఏమాత్రం అవగాహన లేకుండా మాడ్లాడటం బాధాకరమన్నారు. సంక్షోభం వస్తే తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న కుట్ర చంద్రబాబుదని, సంక్షోభం నుంచి ప్రజలని గట్టెక్కించి ఆదుకోవాలన్న తపన తమ ప్రభుత్వానిదని బొత్స చురకలంటించారు.

‘అధికారంలో ఉంటే ఒకలా...అధికారంలో లేకపోతే మరోలా మాట్లాడటం చంద్రబాబు అండ్ కో అలవాటు. మీలాంటి రాజకీయ నేతల వల్లే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోంది. ఇప్పటికైనా అసత్యాలు మాని ప్రభుత్వం చేసిన మంచి పనిని గుర్తించండి. విశాఖ పారిశ్రామిక సదస్సులో మీరు ఎవరితో ఒప్పందాలు చేసుకున్నారో తెలియదా. ఒక్క పరిశ్రమ అయినా వైజాగ్‌కి వచ్చిందా. ఏపిని పారిశ్రామికంగా అభివృద్ది చేయాలని ఉద్దేశంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. గత ప్రభుత్వానికి... మా ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమెరా విషయాన్ని వివాదం చెయ్యాల్సిన అవసరం లేదు. డ్రోన్ కెమెరా విషయాన్ని‌ ముందుగా మాజీ సీఎం చంద్రబాబుకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇల్లు‌ మునిగిపోతోందనే అధికారులు డ్రోన్ కెమెరా ఉపయోగించారు. కొన్ని జిల్లాలలో వర్షపాతం తక్కువ ఉన్న మాట వాస్తవమే’ అని బొత్స తెలిపారు.

మరిన్ని వార్తలు